Leading News Portal in Telugu

Pakistan: పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్.. ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక..


Pakistan: రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం ఇలా పలు సమస్యలు దాయాది దేశం పాకిస్తాన్ ను పట్టిపీడిస్తున్నాయి. మరోవైపు ఆ దేశంలో పేదరికం పెరుగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక చెబుతోంది. ఏకంగా 9.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకీడుస్తున్నారు. పాకిస్తాన్ లో గతేడాది పేదరికం 34.2 శాతం ఉంటే ఈ ఏడాది 39.4 శాతానికి పెరిగింది. 1.25 కోట్ల ప్రజల రోజూ వారి ఆదాయం 3.65 డాలర్ల కన్నా తక్కువగా ఉందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. పాకిస్తాన్ మొత్తం జనాభా 23.14కోట్లుగా ఉంది.

పాకిస్తాన్ ఎకనామిక్ మోడల్ ఆ దేశంలో పేదరికాన్ని తగ్గించడం లేదని, వెనకబడిన దేశాలతో పోలిస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయిందని ప్రపంచబ్యాంకు ఆర్థిక వేత్త టోబియాస్ హక్ అన్నారు. వెంటనే పాకిస్తాన్ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ పై పన్నులు విధించాడాని అత్యవసర చర్యలు తీసుకోవాలని, వృధా ఖర్చలను తగ్గించుకోవాలని కోరారు. టాక్స్ టూ జీడీపీ శాతాన్ని 5 శతానికి పెంచడంతో పాటు జీడీపీలో ఖర్చులను సుమారుగా 2.7 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది.

పాకిస్తాన్ తన జీడీపీలో 22 శాతానికి సమానమైన పన్నులను వసూలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని, అయితే కేవలం 10.2 శాతం మాత్రమే ఉందని ప్రపంచబ్యాక్ నోట్ తెలిపింది. పాకిస్తాన్ గత కొంత కాలంగా తీవ్రమై ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్ నుంచి అప్పు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగింది. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లేవు. గ్యాస్, కరెంట్, పెట్రోల్ ఇలా అన్ని రేట్లు పెరిగిపోవడంతో పాక్ ప్రజలు అవస్థలు పడుతున్నారు.