Udhayanidhi Stalin: కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’తో డీఎంకే పొత్తుపై ఆ రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డీఎంకే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుపై మాట్లాడుతూ.. ఇది పార్టీ అంతర్గత విషయమని, ఇందులో వేర్వేరు పార్టీలున్నాయని తాను చూడనని, రెండింటిని ఒకే పార్టీగా చూస్తానన్నారు. కమల్ హాసన్ పార్టీలో పొత్తు ఉంటుందో లేదో అనే విషయాన్ని ఎన్నికల ముందు డీఎంకే పార్టీ నేతలు నిర్ణయిస్తారని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు.
మరోవైపు సనాతనధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆదేశాలను మీడియాలో చూశానని, ఇంకా నోటీసులు అందలేదని, సుప్రీంపై నమ్మకం ఉందని, నోటీసులు అందిన తర్వాత తగిన వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ మద్దతుగా నిలిచారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఉదయనిధిలాంటి చిన్న పిల్లవాణ్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పెరియార్ వల్లే సనాతనం అందరికీ తెలిసిందని, పెరియార్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన తమిళనాడు సొంతమని కమల్ అన్నారు.