S Sreesanth Slams Sanju Samson: ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్ ఎస్ శ్రీశాంత్ స్పందించాడు. శాంసన్‌ను ప్రపంచకప్‌కి ఎంపికచేయకపోవడం బహుశా సరైన నిర్ణయమే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. సంజూకు అవకాశాలు రావడం లేదనడం సరికాదన్నాడు.
సునీల్ గవాస్కర్, హర్షా బోగ్లే, రవిశాస్త్రి సహా ప్రతిఒక్కరూ సంజూ శాంసన్‌ను మంచి ఆటగాడిగా గుర్తించారని శ్రీశాంత్ తెలిపాడు. సంజూ సామర్థ్యంపై ఎలాంటి అనుమానం అవసరం లేదన్నాడు. పిచ్‌కి అనుగుణంగా ఆడాలని ఎవరైనా సూచిస్తే సంజూ వినడని, ఆ వైఖరిని అతడు మార్చుకోవాలని శ్రీశాంత్ సూచించాడు. ‘నాతో సహా ప్రతిఒక్క మళయాళీ సంజూ శాంసన్‌కు అవకాశాలు రావడం లేదని అంటున్నాం. అయితే అలా అనడం ఏమాత్రం సరికాదు. ఐర్లాండ్, శ్రీలంకపై సంజూకు మంచి అవకాశం వచ్చింది’ అని శ్రీశాంత్ అన్నాడు.
‘సంజూ శాంసన్ 10 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2013 నుంచి ఆటలో ఉన్నా మూడు సెంచరీలు మాత్రమే బాదాడు. ఆటలో స్థిరత్వం చూపించలేదు. సమయం ఎవరి కోసం ఆగదు. ప్రతిభ ఉన్న కొత్త ఆటగాళ్లు జట్టులోకి చాలా మంది వస్తున్నారు. ఆసియా గేమ్స్ 2023కి ఇద్దరు కీపర్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ నీ గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సానుభూతి పొందడం చాలా సులభం కానీ.. మెప్పు పొందడం చాలా కష్టం. శాంసన్ తిరిగి జట్టులోకి వస్తాడనే విశ్వాసం నాకు ఉంది. ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడు’ అని శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.