Leading News Portal in Telugu

Pakistan: హిందువులందరూ ఇస్లాంలోకి మారుతారని ఎదురుచూస్తున్నా.. పాక్ ప్రధాని పాత ట్వీట్ వైరల్..


Pakistan: ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందిన ఇండియాలో లౌకికవాదం వెల్లివిరుస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే..పాకిస్తాన్ మతమౌఢ్యంతో నాశనమవుతోంది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న అన్వర్ ఉల్ హక్ కాకర్ గతంలో ఎక్స్(ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. హిందులందర్ని ఇస్లాంలోకి మార్చడానికి ముస్లింలు సహస్రాబ్ది వరకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. 2020లో ఆయన ఈ పోస్టు చేశారు. ఇస్లాం యొక్క జ్ఞానోదయ సత్యానికి హిందువులందరూ ఒప్పించబడాలని మేము ఎదురుచూస్తున్నాము అని ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఒక కాఫిర్ అని భారతీయ నెటిజెన్ పోస్టు చేయగా.. దానికి ప్రతిస్పందనగా అన్వరుల్ హక్ కాకర్ ఈ ట్వీట్ చేశారు. ఇస్లాం యొక్క సత్యం వైపు హిందువులు ఆకర్షితులయ్యే వరకు వేచి ఉండటానికి తాను, ఇతర మతవాదులతో పాటు సిద్ధంగా ఉన్నానని పోస్ట్ చేశాడు.

అయితే హిందూ బాలికలను, అమ్మాయిలను కిడ్నాప్ చేయడం కొంత వరకు వారి ఇష్టప్రకారమే జరుగుతున్నాయని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాడు. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు రహస్యంగా పారిపోయి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారని,వారి కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించకపోవడమే కారణమని కాకర్ అన్నాడు. ప్రస్తుతం అన్వర్ ఉల్ హక్ కాకర్ ప్రధాని కావడంతో ఆయన చేసిన పాత ట్వీట్ వైరల్ అయింది.

మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కుల, క్రైస్తవుల పట్ల పాకిస్తాన్ లో దారుణాలు జరుగుతున్నాయి. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లోని హిందూదేవాలయాలు, చర్చిలపై దాడులు చేస్తున్నారు. బాలికను, అమ్మాయిలను ఎత్తుకెళ్లి వివాహాలు చేసుకుంటున్నారు. ఈ నేరాల్లో అక్కడి అధికారులు కానీ, న్యాయస్థానాలు కానీ బాధితుల వైపు నిలబడటం లేదు.