Leading News Portal in Telugu

Kishan Reddy : ప్రతిచోటా గురువు పాత్ర కీలకంగా ఉంది


మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ ఆరో సంపుటి.. తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శిల్పకలవేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సరస్వతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ 15 భారతీయ భాషల్లో అనువాదమై.. విశేషమైన ఆదరణ పొందుతుండటం చాలా సంతోషకరమన్నారు. ఇవాళ ఈ ‘శ్రీ గురు భాగవతం’.. ఆరో సంపుటి.. తెలుగు కాపీని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఒక పుస్తకం.. ఇన్ని వాల్యూమ్స్ లో రావడం.. ఇన్ని భాషల్లో విడుదల అవుతుండటం.. అభినందించదగిన విషయం.
దీంతోపాటుగా ఓ తెలుగు ఆధ్యాత్మిక యూట్యూబ్ చానల్ ను కూడా ఇవాళ ప్రారంభించుకోవడం పట్ల శుభాభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ సందర్భంగా గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం.. తల్లిదండ్రులే ఆది గురువులైనా.. విద్యాబుద్ధులు చెప్పి సరైన మార్గదర్శనం చేసే గురువు సహకారం లేకుండా ముందడుగు వేయడం కష్టం. మన పురాణేతి హాసాలు మొదలుకుని.. నేటివరకు ప్రతిచోటా గురువు పాత్ర కీలకంగా ఉంది. అవతార పురుషులైన.. రాముడు వశిష్ట మహాముని దగ్గర
కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర.. శిష్యరికం చేసిన సంగతి మనకు తెలుసు. ఎంతటివారైనా.. గురువు మార్గదర్శనం అవసరం అని చెప్పడమే నా ఉద్దేశం.. గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమ: ఈ శ్లోకం తెలియని వారుండరు.. గురువే సర్వస్వం అని చెప్పడం ఈ శ్లోకం భావన. భారతదేశం జ్ఞాన భాండాగారం. ఎన్నో తరాలుగా గురు పరంపర, జ్ఞాన పరంపర ప్రభావం కారణంగా విదేశీయులు ఇక్కడికొచ్చిన విద్యనభ్యసించేవారు. ఆ తర్వాత విదేశీ శక్తుల కుట్రలు, యుద్ధాల కారణంగా చాలా మటుకు ఈ జ్ఞాన సంపదకు నష్టం వాటిల్లింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా.. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు పెద్దగా జరగలేదు.

నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మెకాలే వంటి వ్యక్తుల ప్రభావంతో దెబ్బతిన్న మన విద్యావ్యవస్థకు మళ్లీ పాత వెలుగులు అందించేందుకు.. 34 ఏళ్ల తర్వాత జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో.. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్.. మ్యాథ్స్, వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషలతోపాటుగా.. నైతిక విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల జీవన విధానం.. మన చారిత్రక కట్టడాలు, చరిత్రాత్మకమైన ఘట్టాలు తదితర అంశాలకు పెద్దపీట వేస్తున్నారు.

ఎప్పుడైతే విద్యార్థి దశనుంచే.. సంస్కారం, విషయ పరిజ్ఞానం, మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి జ్ఞాన సంపద గురించి తెలుస్తుందో.. అప్పుడే చిన్నారుల్లో ఓ ఆలోచన, ఓ కుతూహం మొదలవుతుంది. అదే భవిష్యత్తులో వారు మన దేశం గురించి.. మన ధర్మం గురించి దృష్టిలో ఉంచుకుని పనిచేసేందుకు వీలవుతుంది.

మన సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం నిలవాలి, దేశ భవిష్యత్తు బాగుండాలంటే.. రేపటి తరమైన చిన్నారులకు మన ఆధ్యాత్మిక సంపద, వారసత్వ సంపద గురించి తెలియాలి. గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి వంటి వారు రాస్తు్న పుస్తకాలు చదవాలి. రిటైర్డ్ అధికారులు తమ విస్తృత అనుభవానికి.. ఆధ్యాత్మికతను జోడిస్తే.. ఆసక్తికరమైన రచనలు యువతరం కోసం సిద్ధమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద రావు రిటైర్మెంట్ తర్వాత యువతను ఈ దిశగా ప్రేరేపించేందుకు కృషిచేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరగాలి.. మన దేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా చూసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మనమంతా.. ‘నేను సైతం’ అన్నట్లుగా తలోచేయి వేయాలని ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్ చంద్రభాను సత్పతికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ‘తెలుగు కల్చరల్ ఫౌండేషన్’ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని కిషన్‌ రెడ్డి ప్రసంగించారు.