Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. కెనడాలో చదువుతున్న తమ పిల్లల విద్యపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల చదువు కోసం ఖర్చు చేసిన డబ్బుపై తల్లిదండ్రులలో ఆందోళన మొదలైందని ‘ఖల్సా వోక్స్’ నివేదించింది.
పంజాబ్ విద్యార్థుల నుంచి కెనడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 68,000 కోట్లు ఆర్జిస్తుందని ఖల్సా వోక్స్ (Khalsa Vox) తమ నివేదికలో పేర్కొంది. ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం… గత సంవత్సరం మొత్తం 226,450 వీసాలను కెనడా (శరణార్థులు మరియు పౌరసత్వ కెనడా కింద) ఆమోదించింది. ఇందులో సుమారు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ విద్యార్థులు 2-3 ఏళ్ల పాటు కెనడాలో ఉండి వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. కెనడాలోని పలు విద్యా సంస్థల్లో ప్రస్తుతం 3.4 లక్షల మంది పంజాబీ విద్యార్థులు చదువుతున్నారట.
కెనడాకు వెళ్తున్న భారతీయుల్లో దాదాపు 60 శాతం మంది పంజాబీలే ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఫర్ ఓవర్సీస్ స్టడీస్ చైర్మన్ కమల్ భూమ్లా తెలిపారు. గత సంవత్సరం 1.36 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లారని చెప్పారు. ప్రతి విద్యార్థి సగటున 10,200 కెనడియన్ డాలర్లను గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ ఫండ్స్‌గా డిపాజిట్ చేయడంతో పాటు వార్షిక రుసుములో సుమారు 17,000 కెనడియన్ డాలర్లు చెల్లిస్తాడని పేర్కొన్నారు. 2008 వరకు ప్రతి సంవత్సరం 38,000 మంది పంజాబీలు మాత్రమే కెనడా కోసం దరఖాస్తు చూసుకునేవారని, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిందని ఆయన చెప్పారు.