Leading News Portal in Telugu

IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!


Shubman Gill and Shardul Thakur Out From IND vs AUS 3rd ODI: ఆదివారం ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాను రాహుల్ సేన 99 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగులుండగానే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్‌ 27) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇద్దరు భారత స్టార్స్ దూరం అయ్యారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. దాంతో అతడు రాజ్‌కోట్‌లో జరిగే మూడో వన్డేకు అందుబాటులో ఉండడు. ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి గిల్‌కు విశ్రాంతి ఇచ్చారట. మరోవైపు ఆల్‌రౌండర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌కు కూడా మేనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. గిల్, శార్ధూల్‌ రెండో వన్డే అనంతరం జట్టుతో కలిసి రాజ్‌కోట్‌కు వెళ్లలేదు.

శుభ్‌మన్‌ గిల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌లు తిరిగి గౌహతిలో భారత జట్టుతో కలవనున్నారు. వీరిద్దరూ నేరుగా గువాహటి చేరుకుని.. ప్రపంచకప్ 2023 సన్నద్ధతలో పాల్గొంటారు. సెప్టెంబర్‌ 30న గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో భారత్ వామాప్‌ మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ ప్లేయర్స్ విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యాలు మూడో వన్డేకు అందుబాటులో ఉంటారు. సీనియర్ల రాకతో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూడాలి.