Leading News Portal in Telugu

నీరసం, అలసటగా అనిపిస్తుందా? విశ్రాంతి తీసుకున్న తగ్గట్లేదా? అయితే ఈ సమస్య కావచ్చు


మనకి అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే ఏదో సమస్య ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య విపరీతంగా ఉంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కావచ్చు. దీన్నే దీన్నే మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తే ఇలా నీరసం, అలసట లాంటి లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కొనసాగుతాయి. దీని బారిన పడితే అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి , ఏకాగ్రత తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, విస్తరించిన శోషరస కణుపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి రావడానికి కచ్ఛితమైన కారణాలు ఇంకా గుర్తించలేదు.  వైరల్ ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక దీనిని తగ్గించుకోవాలంటే పనిని కచ్ఛితంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక శ్రమ కారణంగా సీఎఫ్ఎస్ లక్షణాలు తీవ్రమవుతాయి. సమతుల్య దినచర్యను ఏర్పరచుకోవడం, శారీరక శ్రమ తగ్గించుకోవడం ద్వారా మనం దీనిని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక దీనిని తగ్గించుకోవడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాణ్యమైన నిద్రపోతే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి నీటిని, ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం చాలా ముఖ్యం.మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే మీ డైట్ లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. డీహైడ్రేట్ కాకుండా మంచి నీళ్లు, కొబ్బరి నీరు లాంటివి తాగుతూ ఉండండి. ఇలా చేస్తే ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ నుంచి త్వరగా కోలుకొని మళ్లీ ఫుల్ యాక్టివ్ గా మారవచ్చు.