Leading News Portal in Telugu

KTR: డీలిమిటేషన్‌ తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేయాలని చూస్తున్నారు..


డీలిమిటేషన్‌ ( పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం వినాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ కోరారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్‌ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, దక్షిణాది రాష్ట్రాల గొంతుని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ జాతీయ పత్రిక ప్రచురించిన డీలిటేషన్‌కు సంబంధించిన స్టోరీని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్యాగ్‌ చేస్తు పోస్ట్ చేశారు. కథనంలో పేర్కొన్న గణాంకాలే నిజమైతే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేశారు. అయితే, దేశంలో ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్వీభజన జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం పెరుగనుండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా స్థానాలు కోల్పోనున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 32 స్థానాలు కలిసి వస్తుండగా.. సౌత్ ఇండియాకు చెందిన ఆయా రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక, తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్‌ స్థానాలుండగా.. డీలిమిటేషన్‌ తర్వాత అవి 31కి తగ్గుతాయి. తెలంగాణ, ఏపీ, కేరళ నుంచి 8 స్థానాలు, కర్ణాటక రెండు స్థానాలు కోల్పోనుంది. అటు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో 6, బీహార్‌లో పది, ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలు అదనంగా పెరిగే ఛాన్స్ ఉంది.

జనాభా ప్రాతిపదికన.. దేశంలో, రాష్ట్రాల్లో చట్ట సభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్‌ అంటారు. ఈజీగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సరైన సీట్లుండేలా చూసే ప్రక్రియనే డీలిమిటేషన్ అని అంటారు. అంటే మారుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు అన్నమాట.