Leading News Portal in Telugu

BAN vs NZ: మా కెప్టెన్ అలా చేయడం సరికాదు.. ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!


Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్‌ అయి పెవిలియన్‌కు వెళ్తున్న న్యూజిలాండ్‌ బ్యాటర్‌ ఇష్‌ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్‌ కెప్టెన్ లిటన్ దాస్‌ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్‌ ఇక్బాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ కెప్టెన్ వెనక్కి పిలవడం సరైన చర్య కాదని తమీమ్‌ అన్నాడు.

6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను ఇష్‌ సోధి అదుకునే ప్రయత్నం చేశాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 46 ఓవర్‌ను బంగ్లా పేసర్‌ హసన్ మహమూద్ వేశాడు. అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్‌.. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‍లో ఉన్న కివీస్ బ్యాటర్ సోదీని మన్కడింగ్ ద్వారా రౌనౌట్ చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్‌.. బంతిని వేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌.. సోదీని ఔట్‌గా ప్రకటించాడు. సోధి పెవిలియన్ వైపు నడుస్తుండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ సహా మిగతా ఆటగాళ్లు అంపైర్‌లతో చర్చలు జరిపి అతడిని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి తీసుకొస్తాడు.

బంగ్లాదేశ్‌ కెప్టెన్ లిటన్ దాస్‌ చర్యపై తాజాగా సీనియర్ ఓపెనర్ తమీమ్‌ ఇక్బాల్‌ స్పందించాడు. ‘ఇష్‌ సోధి మన్కడింగ్ ద్వారా రనౌట్‌ కావడం నాకు తప్పుగా అనిపించలేదు. ఐసీసీ కొత్త నిబంధనలలో ఇదో రూల్‌. ఇలా ఏ బ్యాటర్ ను అయినా ఔట్ చేయొచ్చు. మా బ్యాటర్ ఇలా పెవిలియన్ చేరొచ్చు. ఎలాంటి వార్నింగ్ అవసరం లేదు. మా కెప్టెన్ ఇలా వికెట్‌ తీయకూడదని భావించి ఉంటాడు. అందుకే సోధిని వెనక్కి పిలిచాడు. అయితే అలా చేయడం సరైనది కాదు అని నేను అనుకుంటున్నా’ అని ఇక్బాల్‌ పేర్కొన్నాడు.