గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించింది. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను తమిళిసై తిరస్కరించడంపై అధికార బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీశ్ రావు స్పందించారు.
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు?.. అని ఆయన ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వవచ్చా?.. సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండవద్దు.. మరి ఆమె ఎలా ఉన్నారు?.. బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా? అని మంత్రి హరీశ్ రావు అడిగారు.
అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైఖరిలో మార్పు లేదు.. నిజంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు.. కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.