Leading News Portal in Telugu

Indrakaran Reddy: గవర్నర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..


తెలంగాణ గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌందరరాజన్ చ‌ర్య స‌మాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టు వంటిద‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యనించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తెలంగాణ రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫార‌సును గవర్నర్ తిరస్కరించ‌డాన్ని దేవాదాయ శాఖ మంత్రి త‌ప్పు ప‌ట్టారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార‌సును గవర్నర్‌ తమిళిసై ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాష్ట్ర ప్రభుత్వలపై రాజ‌కీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వాల అభిష్టానికి అనుగుణంగా గవర్నర్ల వ్యవస్థ వ్యవహరించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. గ‌తంలో ఏ గ‌వ‌ర్నర్ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారి ప‌ట్ల ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న వారిని సేవా కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని గవర్నర్‌ ప్రశ్నిస్తున్నారని? అంటే గవర్నర్‌కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ధోరణి గవర్నర్ మార్చుకోవాలని ఆయన హితవు పలికాడు.