స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు. 2009 నుంచి 2014 వరకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు.. నియోజకవర్గానికి ఎంత సేవ చేసిన తక్కువే, నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని కడియం శ్రీహరి అన్నారు.
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పదవులు రావడం ఈ నియోజకవర్గం ప్రజలు పెట్టిన భిక్షే అంటూ కడియం శ్రీహరి అన్నారు. ఎవరిని మోసం చేసే గుణం నాది కాదు.. పనులు ఇస్తా అని పదవులు ఇస్తానని డబ్బులు తీసుకునే అలవాటు నా దగ్గర లేదు అని ఆయన పేర్కొన్నారు. ఏ పని చేసిన నిజాయితీగా చేస్తా.. మీకు గౌరవం దక్కే విధంగా ఉంటాను తప్ప, తలవొంపులు తీసుకురాను.. కాంగ్రెస్-బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో రైతులకు ఉచిత పథకాలు అందుతున్నాయా అని కడియం ప్రశ్నించారు. అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు.
తుక్కుగూడ బహిరంగ సభలో ఇచ్చిన ఆరు హామీలను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నారా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు.. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ నెంబర్ కే పరిమితమై ఉంటుంది.. కానీ వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా కొట్లాడుకుంటారో మన అందరికీ తెలుసు.. కాంగ్రెస్ పార్టీకి తప్పుదారి ఓటు వేస్తే ఆగమైతాం సుమా.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఆగం చేసుకున్నట్లేనని ఆయన చెప్పారు. ప్రజల మధ్యలో ఉంటే.. పనితీరు మంచిగా ఉంటే, నాయకులను ప్రజలు కడుపులో పెట్టి చూసుకుంటారు.. మంచి పనులు చేస్తే ప్రజలే మనల్ని కోరుకుంటారు.. దానికి ఉదాహరణ నేనే.. నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకోవడం.. నీతిగా నిజాయితీగా ఉంటే అవకాశం వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.