Leading News Portal in Telugu

Top Headlines @ 9AM : టాప్‌ న్యూస్‌


పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో మంగళవారం ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… దేశంలోని పలు నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,220గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.

వన్డే ప్రపంచకప్‌ అంపైర్ల జాబితా ఇదే.. భారత్‌ నుంచి ‘ఒకే ఒక్కడు’!

భారత గడ్డపై అక్టోబర్‌ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 28 వరకు ముందుగా ప్రకటించిన జట్లలో మార్పులు చేసే అవకాశం అన్ని జట్లకు ఉంది. ఇక 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ కూడా సోమవారం ప్రకటించింది. అంపైర్ల జాబితాలో భారత్‌ నుంచి ‘ఒకే ఒక్కడు’ చోటు సంపాదించాడు. అతడే నితిన్‌ మీనన్‌.

16 మంది అంపైర్ల జాబితాలో అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి నలుగురికి చోటు దక్కింది. మైఖేల్‌ గాఫ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బోరో, అలెక్స్‌ వార్ఫ్‌లు ఇంగ్లీష్ అంపైర్లు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురికి (పాల్‌ రీఫిల్‌, రాడ్నీ టక్కర్‌, పాల్‌ విల్సన్‌) చోటు దక్కాగా.. న్యూజిలాండ్‌ (క్రిస్‌ బ్రౌన్‌, క్రిస్టోఫర్‌ గఫ్ఫానీ), దక్షిణాఫ్రికా (మరియాస్‌ ఎరాస్మస్‌, అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌) నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. శ్రీలంక (కుమార ధర్మసేన), భారత్ (నితిన్‌ మీనన్‌), పాకిస్తాన్‌ (ఎహసాన్‌ రజా), బంగ్లాదేశ్‌ (షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్‌), వెస్టిండీస్‌ (జోయెల్‌ విల్సన్‌)ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ విడుదల చేసింది. రిఫరీల్లో సైతం భారత్‌ నుంచి జవగల్‌ శ్రీనాథ్‌కు మాత్రమే అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌ (జెఫ్‌ క్రో), జింబాబ్వే (ఆండీ పైక్రాఫ్ట్‌), వెస్టిండీస్‌ (రిచీ రిచర్డ్‌సన్‌)ల నుంచ్చి ఒక్కొక్కరికి రిఫరీల జాబితాలో చోటు లభించింది. ఇక టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు భారత​ అంపైర్‌ నితిన్‌ మీనన్‌, శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార ధర్మసేన ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

నేడు సుప్రీంకోర్టు ముందుకు మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్‌!

మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ స్కామ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస రెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ.. చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు.

సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును నారా చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేశారు. అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చాం, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారు, ఇది ఏపీకి సంబంధించిన కేసు, ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ మంగళవారం రమ్మని సూచించారు. ఎప్పటి నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారూ లాంటి ప్రశ్నలు అడిగి, రేపటి మెన్షనింగ్‌లో రండి అని విచారణను సీజేఐ ముగించారు.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో తనను విచారించేందుకు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ అనిశా కోర్టు ఈనెల 22న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు పరిష్కరించింది. పోలీసు కస్టడీ ఇప్పటికే ముగిసినందున వ్యాజ్యం నిరర్థకమైనదంటూ విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు.

నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటన

నేడు హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం రోజ్‌ గార్‌ మేళాలో కిషన్‌ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించనున్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కిషన్‌ రెడ్డి పాల్గొననున్నారు. తర్వాత నిజామాబాద్ వెళ్లనున్న కిషన్‌ రెడ్డి.. మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీజేపీ అగ్ర నేతలతో సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోడీ అక్టోబర్ ఒకటో తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. బీజేపీ మహబూబ్ నగర్ భూత్పుర్‌​లో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సభా వేదిక నుంచి మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయం రాష్ట్ర ప్రజలకు వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు, తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలపై ఎండగడుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాలమూరు సభ అనంతరం అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుపై పీఎం స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్​లో ప్రధానితో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక వేళ రోడ్ షో సాధ్యపడకుంటే బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. నల్లగొండలోనూ ప్రధాని మోదీతో సభ నిర్వహించాలని యోచిస్తోంది.

నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణను రానుంది. లిక్కర్ కేసులో కవిత కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ నేపథ్యంలోనే నళిని చిదంబరం తరహాలో తనకు వెసులుబాటు కావాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు తీర్పు వచ్చే వరకు బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది ఈడీ. కవిత కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే.. నేడు విచారణపై సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అత్యాచారం చేసి, కళ్లు పీకి.. యువతి దారుణ హత్య!

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి బావిలో పడేశారని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటినుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

తమ కూతురుకి జరిగిన అన్యాయంపై కావూరివారిపల్లె పంచాయతీ వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ, పద్మావతి దంపతులు సోమవారం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. భవ్యశ్రీ ఇంటర్‌ చదువుతోంది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి భవ్యశ్రీ తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. భవ్యశ్రీని ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో వేధించే వారు. వారే మాయమాటలు చెప్పి భవ్యశ్రీని ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి.. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో పడేశారు.

వినాయక నిమజ్జనం కోసం సెప్టెంబర్ 20న వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కొందరు బావి వద్దకు వెళ్లగా.. మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఆభరణాల ఆధారంగా మునికృష్ణ, పద్మావతి దంపతులు తమ కుమార్తె అని గుర్తించారు. భవ్యశ్రీ కనిపించడం లేదని సెప్టెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మీడియాతో చెప్పారు.

అరె ఏంట్రా ఇది.. ఏం తెలివిరా బాబు.. వీడియో చూస్తే నవ్వాగదు..

దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.. అయితే ఈ మధ్య జనాలు ఎక్కువ అవ్వడంతో రైళ్లో ఎక్కేవారి పరిస్థితి దారుణంగా మారింది.. కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా పోతుంది.. ఇలాంటి పరిస్థితులో సీటు కోసం మహిళలు గొడవ పడుతున్న వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది… ఓ వ్యక్తి రైళ్లో ఊయల కట్టుకొని నిద్రపోతున్నాడు.. ఆ వీడియోను పక్కన ఉన్న ప్రయాణికులు తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అది కాస్త వైరల్ అవుతుంది..

భారతీయ రైల్వేలలో ప్రయాణించడం తరచుగా రద్దీతో దెబ్బతింటుంది. ప్రజలు సరిగ్గా కూర్చోవడానికి లేదా నిలబడటానికి చాలా అరుదుగా స్థలం పొందుతారు. ఇప్పుడు, అలాంటి రద్దీగా ఉండే రైలు కోచ్‌లో ఒక వ్యక్తి తెలివిగా నావిగేట్ చేస్తూ తన కోసం స్థలాన్ని సృష్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో లైక్‌లను రేకెత్తిస్తోంది..వీడియో సృష్టికర్త హతీమ్ ఇస్మాయిల్ బెడ్‌షీట్‌తో తయారు చేసిన తాత్కాలిక ఊయలపై ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తున్నట్లు చూపించే వీడియోను పంచుకున్నారు. ఈ ఊయల నాలుగు వైపులా భద్రపరచబడింది. దుప్పటి మనం అనుకున్నదానికంటే ఎక్కువ మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘అతను రైలు కంటే తన బెడ్‌షీట్‌ను ఎక్కువగా నమ్ముతాడేమో అంటూ రాసుకొచ్చాడు..