Agriculture Support Price Poster Released By AP Minister Kakani: వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్‌ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశామని చెప్పారు.
వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చెప్పిన మాట ప్రకారం ఈ వ్యవసాయ సీజన్‌కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన చేశాం. దళారిల బెడద లేకుండా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రాప్‌లో నమోదు చేసిన ప్రతి పంటకు మద్దతు ధరలు ఉంటాయి. వ్యాపారస్తులు ప్రభుత్వం ప్రకటించిన ఈ రేటు కంటే తక్కువగా కొనుగోలుకు ప్రయత్నిస్తే జోక్యం చేసుకుంటాం. ఏపీ ఎమ్ఎస్‌పీ యాక్ట్ తీసుకుని వస్తాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
‘ఈరోజు క్యాంపు కార్యాలయంలో గడప గడపపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఇదే చివరి సమావేశం. ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలిపోతుంది అన్నది ప్రచారం మాత్రమే. గడప గడపపై ఎప్పటిలానే జరుగుతున్న సమీక్ష లాంటిదే ఇది. ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం దృష్టి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియానే ఈ సమావేశానికి ప్రాధాన్యత కల్పించింది. ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ప్రతి గడపకు వెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని సీఎం ఎప్పుడూ చెబుతారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్లాలనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు’ అని మంత్రి కాకాణి చెప్పారు.