Leading News Portal in Telugu

Manipur Violence: మణిపుర్‌లో ఘోరం.. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య! పిక్స్ వైరల్


2 Students Killed in Manipur who missing in July: మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గత జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం కారణంగా అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికిపోయిన సమయంలో ఈ ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు.

మణిపుర్‌ అల్లర్ల అనంతరం జులై 6వ తేదీన ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో.. అమ్మాయి నీట్‌ కోచింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు బాగానే ఉన్నాయని భావించిన ఆమె.. తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యిందని పోలీసులు అప్పుడు వెల్లడించారు. దాదాపుగా మూడు నెలల అనంతరం ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది.

అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలపై విధించిన ఆంక్షలను మణిపుర్‌ ప్రభుత్వం గతవారం ఎత్తి వేసింది. ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో సోమవారం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. విద్యార్థులను సాయుధులు కిడ్నాప్‌ చేసి.. హత్య చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటో తెలియజేస్తుండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు ఉన్నట్లు మరో ఫొటోలో కనిపిస్తోంది. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా ఉంది. హత్యకు గురైన విద్యార్థులు మైతేయ్‌ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్‌ ప్రభుత్వం వెల్లడించింది.