Leading News Portal in Telugu

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా!


Chandrababu Naidu’s Bail and Petition Tomorrow: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్‌లపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు తమ వాదనలు వినాలని బాబు తరఫు లాయర్లు కోరారు. ఈరోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి తాను సెలవులపై వెళ్లనున్నట్లు తెలిపారు.

బుధవారం రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో.. ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి వ్యవహరించారు. ఆయనే చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్‌ల విచారణ వాయిదా వేశారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో హైకోర్టులో మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు ఆరంభం కానున్నాయి.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోను పరిశీలనలోకి తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అయితే ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో నేటి సాయంత్రానికి తెలియరానుంది.