Leading News Portal in Telugu

UPI: పండగ సీజన్ వేళ.. 42 శాతం మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు..


UPI: పండగ సీజన్ ప్రారంభమైంది. వినాయచవతి, దసరా, దీపావళి ఇలా వరసగా పండగలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా బిజినెస్ పుంజుకుంటోంది. ఇప్పటికే అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫారంలతో పాటు అనేక షాపింగ్ మాల్స్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా డిజిటల్ చెల్లింపులపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం వినియోగదారులు తమ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)ని వాడుతామని చెప్పారు. దీనికి అదనంగా 57 శాతం మంది రివార్డులు, క్యాష్ బ్యాక్ ని పొందడం కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తామని అన్నారు. అమెజాన్ ఇండియా తరుపున నీల్సన్ మీడియా ఇండియా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, UPI ఆధారిత చెల్లింపులు ఆగస్టులో మొదటిసారిగా 10 బిలియన్ నెలవారీ లావాదేవీలను దాటాయి. యూపీఐ నెలవారీ లావాదేవీల సంఖ్య రూ. 15.18 ట్రిలియన్ల నికర లావాదేవీల విలువతో 10.24 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. సర్వే ప్రకారం దాదాపుగా 75 శాతం మంది ఎలక్ట్రానిక్ వస్తువలైన స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. బ్యూటీ బ్రాండ్స్, హోమ్ ఫర్నిషింగ్ ఐటెమ్స్ ను కొనుగోలు చేస్తామని వినియోగదారులు చెబుతున్నారు.

మెట్రోపాలిటన్ నగరాల్లో 87 శాతం, టైర్ -2 నగరాల్లో 86 శాతం మంది వినియోగదారులు పండగ కోసం వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తేలింది. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్ల కోసం ఎదురుచూస్తున్నారని సర్వే తెలిపింది. 80 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్లలో దుస్తులు, ఫుట్ వేర్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది పండగ సీజర్ లో 90,000 కోట్ల విలువైన ఆన్‌లైన్ గ్రాస్ మర్చండైజ్ విలువ (GMV)ని చూసే అవకాశం ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక ప్రకారం ఇది గతేడాది పండుగ నెల అమ్మకాలతో పోలిస్తే 18-20 శాతం పెరిగిందని తెలిపింది.