Leading News Portal in Telugu

జగన్ కక్ష పూరిత రా జకీయాలు.. వ్యవస్థలే టార్గెట్! | jagan vindictive politics| systems| target| election| promises| ignore| all| sections


posted on Sep 27, 2023 2:23PM

జగన్ రెడ్డి కక్ష రాజకీయాలు దాటి, వ్యక్తులను దాటి ఏకంగా వ్యవస్థలనే టార్గెట్ చేసిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్రమాస్తుల కేసులో తనను జైలుకు పంపిన వ్యవస్థలపై ఆయన కక్షకట్టారనీ, అందుకే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో ఉన్న పెంపుడు చిలుకలుగా మార్చేసిన జగన్ ఇక న్యాయ వ్యవస్థపై కూడా పంజా విసరాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్ రెడ్డి.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిపై వేధింపులకు దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ కు గురైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.   ఇక అధికారం చరమాంకానికి వచ్చిన తరుణంలో జగన్ వైనాట్ 175 అన్న ధీమానుంచీ ఎట్ లీస్ట్ అధికారం మరో సారి అన్న అభ్యర్థనలను కూడా జనం వినరన్న నిర్ధారణకు వచ్చిన తరువాత.. తనతో పాటు అందర్నీ ముంచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులకు తెరతీశారని రామకృష్ణం రాజు ఆరోపించారు. నిజమే.. జగన్ విపక్షాలను అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో దిగ్బంధించేసి రాష్ట్రం మొత్తాన్ని భయం గుప్పెట బంధించేసి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో విశృఖలంగా వ్యవహరిస్తున్నారనీ, పీక్స్ చేరిన అధికార ఉన్మాదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

అయితే జనం ఒక సారి డిసైడ్ అయితే.. ఎదుటి వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంతగా మంద బలంతో అణచివేయాలని చూసినా ప్రజల చేతిలోని ఓటు అనే పాశుపతాస్త్రం సూటిగా లక్ష్యాన్నే తాకుతుందని, ఎంతటి వారినైనా ఓడించి ఇంటికి పంపుతుందనీ చరిత్ర పలుమార్లు రుజువు చేసిందంటున్నారు. అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుతుందని భావించిన నేతలు ప్రజాగ్రహానికి గురై ఇళ్లకే పరిమితమైన ఉదంతాలెన్నో ఉన్నాయని ఉదహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల ఆగ్రహాన్నీ చవి చూస్తున్నారనీ, ప్రజాగ్రహాన్ని కూడా దౌర్జన్యంతో అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనీ అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు హామీ అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదనీ, అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వోద్యోగులు, సంపూర్ణ మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి మహిళల ఆగ్రహానికీ గురైన జగన్ను ఇప్పుడు ఆ ఆగ్రహ జ్వాలల సెగ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, ప్రలోభాలూ ఇవేవీ జగన్ ను ఎన్నికలలో ఓటమి నుంచి కాపాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ అన్ని హద్దులూ దాటేసి జరగని కుంభకోణాలు, లేని కేసులతో విపక్ష నేతలను నిర్బంధించి గెలవాలని, గెలుస్తాననీ భావించడం భ్రమే అవుతుందని అంటున్నారు. జగన్ కు విజయం కనుచూపుమేరలో కూడా లేదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయని పరిశీలకులు ఉదహరిస్తున్నారు.