Leading News Portal in Telugu

Supreme Court: సీజేఐ బెంచ్‌ ముందుకు చంద్రబాబు పిటిషన్‌ విచారణ.. కేసు మంగళవారానికి వాయిదా


స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం జరిగింది. నేడు (బుధవారం) ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది.. న్యాయమూర్తులు ఈ కేసును విచారణ చేసేందుకు విముఖత చూపారు. ఈ పిటిషన్‌పై నాట్ బి ఫోర్ మీ అని ధర్మాసనంలోని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించడంతో ఈ పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దగ్గర ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్‌ను ఆయన తరఫున లాయర్లు మెన్షన్ చేసే ప్రయత్నాలు సఫలం అయ్యాయి.

ఇక, సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని లూద్రా వాదించారు. 17ఏను అనుసరించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో సీఐడీ తరఫున లాయర్ రంజిత్.. 17 ఏ సవరణ చేయకముందు ఈ స్కామ్ జరిగిందన్నారు. అనంతరం మరో బెంచ్‌కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

అయితే, సుప్రీం కోర్టుకు రేపటి నుంచి వారం రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో మంగళవారానికి వాయిదా వేశారు. మిలాద్ ఉన్ నబీ, గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2 వరకూ వరుస సెలవులు ఉన్నాయి. దీంతో వచ్చే మంగళవారమే ఇక చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ వాయిదా పడటంతో పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంతేకాదు, ఆయన రిమాండ్‌ను కూడా ఏసీబీ కోర్టు వచ్చే నెల 5 వరకు విధించింది. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటీషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫున లాయర్లు సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలు చేశారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది.