Leading News Portal in Telugu

Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..


Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగుతోంది. ఇక తుపాకులను వదిలి నాగళ్లను పట్టనుంది. వ్యవసాయం చేసేందుకు తమకు 10 లక్షల ఎకరాల భూమి కావాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ భూమి కావాలని కోరింది. ఢిల్లీ నగర విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్ల భూమిని పాక్ సైన్యం హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.

దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ భూమిని పాక్ ఆర్మీ లీజుకు తీసుకోబోతోంది. గోధుమ, ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లను పండించనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేయకుండా మేం చూస్తామని పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపై వచ్చే లాభంలో 20 శాతం వ్యవసాయ అభివృద్ధి పరిశోధనకు కేటాయిస్తామని చెబుతోంది.40 శాతం ఆర్మీకి, 40 శాతం పంజాబ్ ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇందులో పాక్ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని పలువరు ప్రశ్నలు లేవనెత్తతున్నారు.

దీనికోసం పాక్ ఆర్మీ ఫామ్ గ్రో అనే సంస్థ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఆర్మీ అధికారిని చీఫ్ గా నియమించింది. అయితే ఈ భూబదలాయింపులపై లాహోర్ హైకోర్టులో వ్యతిరేకిస్తూ కేసు ఉంటే, జూలై నెలలో మరో బెంజ్ పాక్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ బదలాయింపు వేగంగా జరుగుతోంది. ఈ ప్రణాళిక వల్ల సాధారణ పాకిస్తాన్ రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నిపుణులు భయపడుతున్నారు.