గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్‌సాగర్, ప్రధాన చెరువుల్లో బేబీ పాండ్స్‌తో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ట్యాంక్ బండ్‌లో 30 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 14 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా పీఓపీ విగ్రహాల కోసం 72 బేబీ పాండ్‌లను ఏర్పాటు చేశారు.
చెరువుల పక్కనే 28 బేబీ చెరువులు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 12 అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఒకసారి 60 నుంచి 80 విగ్రహాలు నిమజ్జనం చేసి వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. 23 ప్రాంతాల్లో తాత్కాలిక బేబీ పాండ్‌లు నిర్మించి అందులో 6 నుంచి 8 అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
నగరంలోని ప్రధాన రహదారుల్లో 354 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర సాగనుంది. ఈ క్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ విభాగం పూడ్చింది. రూ.2.15 కోట్లతో 354 కిలోమీటర్ల రోడ్లలో నిమజ్జన కేంద్రాల వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.శోభాయాత్ర మార్గంలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి, ఇతర వ్యర్థాలను తొలగించారు. శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య పనుల కోసం పది వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. పది వేల మంది కార్మికులు, 295 మంది జవాన్లు, 688 మంది ఎస్‌ఎఫ్‌ఐలతో 168 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో క్రేన్ వద్ద 21 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
క్రేన్లపై పనిచేసేందుకు వెయ్యి మంది ఎంటమాలజీ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. 75 ప్రాంతాలతో పాటు హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ చెరువు, కూకట్‌పల్లి, కాప్రా, మల్కాజిగిరి సరస్సులలో నిమజ్జనం చేయనున్నారు. డైవింగ్ ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.వివిధ ప్రాంతాల్లో అవసరమైన స్టేజీలు, భారీ కేసింగ్‌ను ఆర్‌అండ్‌బీ ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద జలమండలి తాగునీటిని సరఫరా చేయనుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఊరేగింపు మార్గాల్లో వీధిలైట్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.