Leading News Portal in Telugu

Russia: నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ పేలుడు వెనక యూకే, అమెరికా..రష్యా ఆరోపణలు..


Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రష్యాను కట్టడి చేసేందుకు ఇప్పటికే వెస్ట్రన్ దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. గతేడాది రష్యా నుంచి యూరప్ లోని వివిధ దేశాలకు గ్యాస్ ను తీసుకెళ్లే నార్డ్ స్ట్రీమ్ పైపు లైన్ 2022లో పేలుళ్లకు గురైంది. బాల్టిక్ సముద్రంలో ఉండే ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ధ్వంసమైంది. అయితే ఈ గ్యాస్ పైపులైన్ పేలుళ్ల వెనక బ్రిటన్, అమెరికా హస్తం ఉందని రష్యా బుధవారం తెలిపింది. ఇది ఉగ్రవాద దాడే అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు.

మరోవైపు వెస్ట్రన్ దేశాలు ఆర్థికంగా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్న తరుణంలో కొత్తగా కూటములను ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉంది క్రెమ్లిన్. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధంలో మందుగుండు సామాగ్రి, ఇతర సామాగ్రి కోసం పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో చర్చలు జరిపారు. చైనాతో కూడా రష్యా తన బంధాన్ని పటిష్టం చేసుకోవాలని చూసుకుంటోంది.