Leading News Portal in Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి


Delhi CM Arvind Kejriwal Bungalow Renovation Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం నివాస పునరుద్ధరణ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడమే కారణం. ఢిల్లీ సీఎం నివాసం పునరుద్ధరణలో జరిగిన కుంభకోణంపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. మే నెలలో ఢిల్లీ ఎల్‌జీ సీబీఐ డైరెక్ట్‌కు విచారణ కోరుతూ లేఖ రాశారు. దీని ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. నిజానికి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ జరిపిన విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అక్రమాలకు సంబంధించిన అన్ని కోణాల్లో సీబీఐ ఇప్పుడు దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంలో కాగ్‌ ప్రత్యేక ఆడిట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు బీజేపీ తన శక్తినంతా వినియోగించుకుందని ఆప్‌ ఆరోపిస్తోంది. నేడు దేశంలో విద్య, ఆరోగ్య రంగాలలో అద్భుతమైన కృషి చేస్తూ ఓట్లు అడుగుతున్నది ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కానీ పేదలకు మంచి విద్య, అద్భుతమైన వైద్య సదుపాయాలు అందడం బీజేపీకి ఇష్టం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో బీజేపీ మత, కుల రాజకీయాలకు గండిపడుతుందన్నారు. ఈ కారణంగానే దేశంలోనే అత్యుత్తమ విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు జైలు పాలయ్యారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ముట్టడించేందుకు దర్యాప్తు సంస్థలన్నీ రంగంలోకి దిగాయన్నారు. అయితే ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులు అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్నాయని ఆప్‌ నేతలు పేర్కొ్న్నారు.

ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్‌పై 50కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారని ఆప్ తెలిపింది. వాటిలోంచి ఏమీ బయటకు రాలేదని వెల్లడించింది. దీని నుండి కూడా ఏమీ బయటకు రాదని పేర్కొంది. బీజేపీ ఎన్ని విచారణలు కోరుతున్నా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం సామాన్యుల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటారు. భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దుతామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతినబూనారన్నారు. దీని కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని ఆప్‌ పేర్కొంది.

45 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వివాదం చెలరేగింది. ఆరోపణల నేపథ్యంలో ఎల్‌జీ సక్సేనా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని, అవకతవకలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని, చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీఎం నివాసాన్ని పునరుద్దరిస్తున్నారనే నెపంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చేసిన ఫిరాయింపులు/ ఉల్లంఘనల వివరాలతో కూడిన చీఫ్ సెక్రటరీ నివేదిక ఆధారంగా, ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించాలని సక్సేనా సీబీఐకి లేఖ రాశారు.

నివాసం కోసం కొనుగోలు చేసిన ఎనిమిది కొత్త కర్టెన్‌లలో ఒకదాని ధర రూ.7.94 లక్షలకు పైగా ఉండగా, చౌకైన కర్టెన్ ధర రూ.3.57 లక్షలు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. వియత్నాం నుండి రూ. 1.15 కోట్ల విలువైన మార్బుల్‌ను తీసుకురాగా, ముందుగా నిర్మించిన చెక్క గోడలకు రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు సంబిత్‌ పాత్ర చెప్పారు. కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన నివాసానికి ఖర్చు చేసిన మొత్తం రూ. 171 కోట్లు అని, గతంలో నివేదించిన ప్రకారం రూ. 45 కోట్లు కాదని పేర్కొంది.