Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి కృషి జరుగుతోంది.. పెట్టుబడిదారులకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. పర్యాటకులకు విశేష సేవలు అందించిన హోటల్స్ కు అవార్డులు అందించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి.. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతం మన దేశం అన్నారు. దేశంలో అత్యధిక పర్యాటక అభివృద్ధి గల ప్రాంతంగా ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా 2020-2025 పాలసీ అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పీపీపీ పద్దతిలో 14 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. సింగిల్ విండో పద్ధతుల్లో పెట్టుబడి దారులకు అనుమతి ఇస్తున్నామని.. 48 టూరిజం హోటల్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పర్యాటక స్థలాలు కబ్జా కాకుండా పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తాం.. ఏపీ టూరిజం ఫోరమ్ ను ఏర్పాటు చేసి సంస్థాగతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.