Leading News Portal in Telugu

India-Canada: కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ


India-Canada: కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కొందరు ఖలిస్తానీ ఎలిమెంట్స్ మాత్రం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలు పెంచేలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇండియాకు, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కెనడాలో ఆందోళన, నిరసన చేపడుతున్నారు. మరోవైపు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందువులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.

ఇదిలా ఉంటే పన్నూ కెనడాలోకి రాకుండా నిషేధం విధించాలని ‘హిందూ ఫోరమ్ కెనడా(హెచ్ఎఫ్‌సీ)’ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఓ వీడియోలో పన్నూ మాట్లాడుతూ.. కెనడియన్ హిందువులు కెనడాను వదిలి ఇండియాకు వెళ్లిపోవాలని, వారు కెనడా రాజ్యాంగాన్ని పాటించడం లేదని, సిక్కుల మాత్రమే కెనడా చట్టాలకు, రాజ్యాంగానికి మద్దతుగా ఉంటున్నారని హెచ్చరించాడు. దీనిపై హిందూ సంస్థ.. హిందువులు, భారతీయుల్లో భయాన్ని వ్యాప్తి చేశాడని ఆరోపిస్తోంది.

హెచ్ఎఫ్‌సీ న్యాయ సలహాదారు పీటర్ థోర్నింగ్ కెనడా ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ మంత్రి మార్క్ మిల్లర్ తో భేటీ అయ్యారు. పన్నూ కెనడాకు రాకుండా అతడిని నిషేధించాలని కోరారు. పన్పూను భారతదేశం 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ నుంచి పంజాబ్ వేరు చేసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశం ఏర్పాటు చేయాలని, ఇండియాకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నాడు. సిక్కు యువతను తప్పుదోవపట్టిస్తున్నాడు. ఇతనిపై దేశంలో పలు కేసులు ఉన్నాయి. ఇదే కాకుండా పన్నూకు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో లింకులు ఉన్నాయి. కెనడాలో భారతీయ మూలాలు ఉన్న వారు 4 శాతం మంది ఉన్నారు.