Leading News Portal in Telugu

Asian Games: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం


Asian Games 2023:  చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. నిన్న రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచిన భారత్ ఖాతాలో నేడు మరో గోల్డ్ చేరింది. ఇది షూటింగ్ విభాగంలో దక్కింది. గురువారం ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తో కూడిన భారత జట్టు ఫైనల్లో  అగ్రస్థానం సాధించింది.  ఇక సరబ్ జోత్, అర్జుణ్ సింగ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు అర్హత సాధించారు.

మరోవైపు  మహిళల 60 కిలోల విభాగంలో కూడా భారత్ పతకం సాధించింది. రోషిబినా దేవి ఈ విభాగంలో రజత పతకం గెలిచింది. పసిడి పతకం కోసం చైనా క్రీడాకారిణి  వు జియావోయ్‌తో పోటీ పడిన రోషిబినాదేవి ఓటమి పాలవడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బుధవారం 50 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ విభాగం (3 పొజిషన్స్‌)లో భారత మహిళా జట్టు రజతం (సిల్వర్‌ మెడల్‌) సాధించిన విషయం తెలిసిందే. భారత షూటింగ్‌ త్రయం సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కింది. అదే సమయంలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల అర్హతలో సిఫ్ట్‌కౌర్‌ రెండవ స్థానంలో, చోక్సీ ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఇప్పటి వరకు ఆసియా క్రీడలు 2023 లో భారత్ 24 పతకాలతో నిలిచింది. ఇందులో  6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.