మేధావుల మౌనం నేరమే ? | intelectuals sclience crame| jagan| sarkar| policies| anti| people| debts| financial
posted on Sep 28, 2023 12:06PM
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నా, వారసత్వ సంపదని దోపిడీ చేస్తున్నా, రాష్ట్రం ఏమై పోతున్నా మేధావుల పాత్ర మౌనమేనా? మేధావుల మౌనమే పాలకుల దౌర్జన్యం. మేధావుల ప్రేక్షక పాత్రే పాలకుల అరాచకం. మేధావుల మౌనం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతం. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకొనే మేధావుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాలకులను మేధావులు ప్రశ్నించాల్సి వుంది. అసమర్ధ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెగిన గాలిపటం చందంగా మారింది.
అడ్డగోలు, అసంబద్ధ నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలు అయ్యింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా అంచుకు చేరింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. పనుల కోసం పోటీ పడే కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని దుస్థితి దాపురించింది. సంపద పెంచకుండా అందిన కాడల్లా అప్పు చేసి సంక్షేమం పేరిట నగదు పంచడం సంక్షేమమా? ఆర్ధిక అరాచకమా అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కానీ, అధికారులు బాధ్యులు కారు. చేసిన అప్పులకు బాధ్యత తీసుకోవలసింది ప్రజలే. ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు అప్పులు తీసుకు రానిదే రోజు గడవని పరిస్థితి. జగన్‌రెడ్డి అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల విజ్ఞత ఉన్న వారెవరికైనా ఆందోళన కలుగుతుంది.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నది. సంక్షేమ పథకాలతో ఉద్ధరిస్తున్నానని చెబుతున్నా ఆ సంక్షేమ పథకాలకు కూడా అప్పులు పుట్టని దుస్థితి దాపురించినా మేధావులు మాత్రం ప్రశ్నించరు. అట్లాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఏ గతి పట్టించారో మేధావులకు కనపడటం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా రాజధాని కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కారణం ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పైసా ఖర్చు లేకుండా రైతులు వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారు.
రాజధాని నిర్మించే మహత్తర అవకాశాన్ని కాలదన్ని దుష్ట తలంపులతో అమరావతిని పాడు బెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినా రాష్ట్రంలో వున్న మేధావులు ప్రశ్నించారా? ప్రశ్నించాల్సిన బాధ్యత మేధావులకు లేదా? అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆధారపడి వుంది. అందుకే దీని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం పోలవరం సాకారం దిశగా నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్న తరుణంలో.. 2019 ఎన్నికలు జరిగి గత ప్రభుత్వం ఓడిపోయి అధికారం అసమర్ధుడికు దక్కి పోలవరం మళ్ళీ బలిపీఠమెక్కింది.
అసమర్ధ పరిపాలనలో జరిగే నష్టమేంటో చెప్పడానికి పోలవరం ప్రాజెక్టు కేస్ స్టడీ వంటిది. పోలవరాన్ని నాశనం చేసి ప్రాజెక్టు నిర్మాణంపై చేతు లెత్తేసినవారిని మేధావులు ప్రశ్నించరా? మేధావులు రాష్ట్ర ప్రయోజనాల పక్షమా? లేక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వారి పక్షమా? అనేది తేల్చుకోవాల్సింది మేధావులే. అదే ఇంకొక ప్రభుత్వం ఇంత మూర్ఖంగా, ఇంత అడ్డగోలుగా, మరి ఇంత అనాగరికంగా పరిపాలన సాగిస్తే కొందరు మేధావులు నానా యాగీ చేసేవారు కాదా?
నిద్ర లేచింది మొదలు పేదల జపం చేస్తూ, పేదలను ముందుపెట్టి రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన వారు ఆచరణలో చేస్తున్నది ఏమిటి? సంక్షేమ పథకాల పేరిట ఈ నాలుగున్నరేళ్లలో మహా అయితే ఒక్కో కుటుంబానికి రూ. లక్షకు పైగా పంచి పెట్టి ఉంటారు. అందుకోసం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి సోకాల్డ్ సంక్షేమ పథకాలకు ప్రచారం పేరిట తన సొంత మీడియా సంస్థలకు ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.500 కోట్ల రూపాయలను దోచి పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూడా పేదలకు ఇచ్చింది రూ. లక్షకు పైగా మాత్రమే. అదే జగన్ రెడ్డి, తన సొంత మీడియా వ్యవస్థలకు మళ్లించింది మాత్రం అక్షరాల 500 కోట్ల రూపాయలు. ఇంత కంటే మోసం, దగా ఉంటుందా? ఇటువంటి దారుణాలపై మేధావులు ఎప్పుడన్నా ప్రశ్నించారా? పాలకుల కపటత్వాన్ని కొందరు మేధావులు ఎందుకు ప్రశ్నించరు? 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికితే నిజమనుకున్న ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మర్చిపోయినా, జగన్ రెడ్డికి ఆ విషయం గుర్తు చేయడానికి ఒక్క మేధావి కూడా సాహసం చేయ్యరా? మహిళల భద్రతా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కళ్ళకు కనబడుతున్నా, మహిళల పట్ల మానవ మృగాలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నా ఆడపిల్లలకు భద్రత ఎక్కడ? అని ఏ ఒక్క మేధావి ప్రశ్నించరు.
అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ పని చెయ్యక పోగా 8 విడతలుగా విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై రూ.50 వేల కోట్లకుపైగా భారం మోపి.. నడ్డి విరుస్తున్నా.. ఒక్క మేధావి కూడా ప్రశ్నించరు? విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోయినా ఒక్క మేధావి మాట్లాడరు? ఎందుకంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తనపై, తనవారిపై ఉన్న కేసుల నుంచి బయటపడటం, బయటపడేయటం ముఖ్యమైనదిగా మేధావులు భావిస్తున్నారా? సంపూర్ణ మధ్య నిషేధంలో భాగంగా దశల వారీగా మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన వారు.. ప్రస్తుతం తాగే మద్యాన్నే కాకుండా భవిష్యత్‌లో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తెస్తున్నా, కల్తీ మద్యం అమ్ముతూ మందు బాబుల ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నా, మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయం పెంచుకుంటున్నా, మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు పోగేసుకొంటున్నా, మద్య నిషేధం అమలుకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం… అయినా ఏ ఒక్క మేధావి మాట్లాడరు? సమస్త పన్నులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదల బతుకు చిధ్రమవుతున్నా ఒక్క మేధావి కూడా ప్రశ్నించరు. నిలదీయరు.
రాష్ట్రంలో రోడ్లు సర్వనాశనం అయి మోకాళ్ళ లోతు గుంతలు పడి రహదారులు నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారినా రోడ్లు బాగా లేవని, రోడ్లు బాగు చేయమని గాని, దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించి ఒక్క మేధావి ప్రశ్నించరు. ఎందుకంటే పెట్రోల్ ఆదా చెయ్యడం కోసం.. ప్రయాణాలను తగ్గించడం కోసం.. రోడ్లు బాగుచేయడం లేదని చెబుతారేమోనని, ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో అధ్వాన్న స్థితి అద్దం పడుతున్నది. ప్రజలు నమ్మి అధికారం అప్పగించినందుకు రాష్ట్రం కోల్పోయింది ఏమిటో మేధావులు గుర్తించడం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు తెరవాల్సిన మేధావులు మౌనంగా ఉండటం ఏమిటి? కుహనా మేధావుల సంఖ్య పెరిగిపోతుంది. వారు ప్రవచించే నీతులు కింద నిజం కప్పబడి పోయింది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం జరగనిది, జరిగినట్లు, చెడును మంచిగా చెప్పడం వల్ల సమాజానికి ఎంత చేటు చేస్తున్నారో వారే అర్ధం చేసుకోవాలి.
నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పడానికి మేధావులు ముందుకు రాకపోతే ప్రజలకు నష్టం చేసిన వారు అవుతారు. దీని వల్ల ఉగ్రవాదులు నుంచి వచ్చే ప్రమాదం కన్నా, అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న మేధావుల వల్లనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలపై ప్రజాస్వామ్య వాదులు, మేధావులు గళం విప్పాలి. సంఖ్యా బలంతో ప్రభుత్వం.. పార్లమెంటరీ సాంప్రదాయాలను, పద్దతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారం పాలన సాగిస్తోంది. కావునా జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించనప్పుడు ప్రశ్నించాల్సిన భాధ్యత మేధావులదే, అరాచకం, అహంకారం, స్వార్ధం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మేధావులు ఇప్పటికైనా మౌనం వీడి పాలకుల కపటత్వాన్ని ప్రశ్నించాలి.
నీరుకొండ ప్రసాద్
9849625610