Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న దాయాది దేశం దక్షిణాసియాతో పాటు యూరప్ దేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసింది. చివరకు తన ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి చైనాకు గాడిదనలు ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ దేశం బిచ్చగాళ్లు, దొంగలను కూడా ఎగుమతి చేస్తోంది. మీరు వింటుంది నిజమే పరాయి దేశాలకు వెళ్లిన పాకిస్తానీయులు దొంగలు, బిచ్చగాళ్లుగా మారుతున్నారు.
సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల్లో పట్టుబడుతున్న బిచ్చగాళ్లలో పాకిస్తాన్ దేశానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ దేశాలు బిచ్చగాళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయంటే వారి అడుక్కోవడం ఏ రేంజులో ఉందో అర్థమవుతోంది. మక్కా గ్రాండ్ మసీదు వెలుపల అరెస్టు అవుతున్న పిక్ పాకెటర్లలో ఎక్కువ మంది పాకిస్తానీయులే ఉంటున్నారు. పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్లు ఎక్కువగా పశ్చిమాసియా దేశాలకు తరలివెళ్తున్నట్లుగా ‘స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్తానీస్’ ఆందోళనను వెలిబుచ్చింది.
ముఖ్యంగా సౌదీ, ఇరాక్, ఇతర గల్ఫ్ దేశాల్లో నిర్భంధించబడుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్తాన్ కి చెందిన వాళ్లే ఉంటున్నారని ఓవర్సీస్ పాకిస్తానీస్ కార్యదర్శి జిషన్ ఖంజదా చెప్పారు. మక్కా ఉమ్రా యాత్రకు ముసుగులో వీసాలపై వెళ్తున్న పాకిస్తాన్ జాతీయులు అక్కడికి వెళ్లి బిక్షాటన చేస్తున్నారని ఇరాక్, సౌదీ రాయబారులు తమకు తెలిపారని ఆయన అన్నారు. 10 మిలియన్ల పాకిస్తాన్ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని, వీరిలో ఎక్కువ సంఖ్యలో భిక్షాటన చేస్తున్నారని తెలియజేశారు.
ఇలాంటి వారు వీసాలు పొంది వేరే దేశాల్లో భిక్షాటనను ఆశ్రయిస్తున్నారు, పాక్ నుంచి మిడిల్ ఈస్ట్ వెళ్లే విమానాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. యూఏఈలో 16 లక్షల మంది, ఖతార్ లో రెండు లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారు. ఇదే కాకుండా ఇరాక్, సౌదీ దౌత్యవేత్తలు తమ జైళ్లు బిక్షగాళ్లతో నిండిపోయాయని చెబుతున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉన్న పాకిస్తాన్ అక్కడ ప్రజలకు నిత్యావసరాలు, కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతోంది. బడ్జెట్ లో చాలా వరకు సైన్యానికే వెళ్తుండటం, సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు పెట్టకపోవడం వంటి వాటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్భణం ఉంది. విద్యుత్, పెట్రోల్, నిత్యవసరాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.