సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ? ఏ బిగ్ డీల్ కోసమో? | jagan adani secret meet| tadepalli| palace| deal| big| dinner| several
posted on Sep 29, 2023 6:20AM
ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే పారదర్శకత ఉండాలి. భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇదే కదా అనుకుంటున్నారా? ఔను నిజమే కానీ.. అచ్చం అలాంటి డైలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే అప్పటికి ఆయన సీఎం కాలేదు. కానీ, ఆయన సీఎం అయ్యాక మాత్రం ఆ డైలాగ్ మర్చిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నాడు సినిమా డైలాగులు చెప్పిన జగన్ ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వం విడుదల చేసే జీవోలు రహస్యం. ఆయన నిర్ణయాలు రహస్యం. చివరాఖరికి ఆయన భేటీలూ రహస్యంగానే సాగిస్తున్నారు. మొత్తంగా జగన్ రహస్య పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజేయాలి. ప్రతి అంశాన్ని జనాలకు వివరిస్తూ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు.. మేం ప్రజలకు చెప్పేదేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.
అసలు కనీసం సీఎంను ఎవరు కలుస్తున్నారో.. ఎందుకు కలుస్తున్నారో.. వ్యక్తిగతంగానే ఈ భేటీలు జరుగుతున్నాయా? లేక ప్రభుత్వ పరమైన విధానాల కోసమే జరుగుతున్నాయా అన్న కనీస సమాచారం కూడా ప్రజలకు తెలియజెప్పడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ భేటీకి తాడేపల్లి ప్యాలెస్ వేదికైంది. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ కూడా చేశారు. అయితే ఇంత సడన్‌గా ఏపీకి అదానీ ఎందుకొచ్చారు? అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి మరీ వీఐపీ హోదాలో ఆయనను తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లడంతో విషయం బయట పడింది. ఏపీలో వ్యాపార సంబంధ వ్యవహారాలపై మాట్లాడేందుకు వచ్చారని వైసీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. కానీ, అదానీ ఎందుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా చెప్పే వారే లేరు.
జగన్ ఇప్పటికే అదానీకి అప్పనంగా కోట్ల రూపాయిలు విలువచేసే ప్రాజెక్టులు కట్టబెట్టారు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు రాసిచ్చేశారు. విశాఖలో డేటా సెంటర్ పేరుతో కొండల్ని కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఇచ్చేయాలనుకున్నా.. చివరికి అదానీ సమస్యల్లో ఇరుక్కోవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పటికే సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరి ఇంకా ఏపీలో ఏం మిగిలుందని ఈ రహస్య భేటీ జరిగిందన్నదా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మరో బిగ్ డీల్ ఏదైనా జరగబోతోందా అంటే నెటిజన్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార వర్గాలలోనూ, రాజకీయవర్గాలలోనూ ఇదే చర్చ జరుగుతోంది.
గౌతం అదానీకి మన రాష్ట్రంలో రహస్య పర్యటనలు చేయడం కొత్తేమీ కాదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికే చాలా సార్లు రహస్యంగా వచ్చారు. సీఎం జగన్ తో పలు దఫా రహస్య చర్చలు కూడా జరిపి వెళ్లారు. గతంలో కూడా ఆయన ఎందుకొచ్చారు? ప్రభుత్వ పని మీదనా? వ్యక్తిగత పని మీదనా అన్న విషయాలను సీఎంవో కానీ.. క్యాంప్ ఆఫీస్ వర్గాలు కానీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ సారి కూడా భేటీపై అధికారిక ప్రకటన వచ్చే అకాశం లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, అదానీ స్వయంగా వచ్చి జగన్ తో డిన్నర్ చేసి వెళ్లారంటే ఖచ్చితంగా అది బిగ్ డీల్ అన్నది అర్ధమవుతుంది. ఏ విషయమైనా దాచేస్తే దాగదులే అన్నట్లుగా ఈ భేటీ ఏ బిగ్ డీల్ కోసం అన్నది ఇవాళ కాకున్నా రేపైనా బయటపడక మానదు.