Leading News Portal in Telugu

Ravichandran Ashwin Entry: వచ్చేశా, నేను వచ్చేశా.. యాష్ అన్న బస్సు ఎక్కుతున్న వీడియో వైరల్!


R Ashwin’s Running Video Goes Viral after Bcci Announce ICC World Cup 2023 India Team: రెండు వారాల ముందు వరకు వన్డే జట్టులో కూడా చోటు లేని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. అనూహ్యంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. ఆసియా కప్‌ 2023 సందర్భంగా గాయపడ్డ అక్షర్‌.. చివరి అవకాశం వరకు కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అక్షర్‌ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చింది.

ఆర్ అశ్విన్‌ అనూహ్యంగా వన్డే ప్రపంచకప్‌ 2023 జట్టులోకి రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో అశ్విన్‌పై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ చేసిన వీడియో హైలెట్‌గా నిలిచింది. 2022లో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలోని ఓ సీన్‌ను రాజస్థాన్ ఎడిట్ చేసింది. విజయ్ పరుగెత్తుకుంటూ బస్సును క్యాచ్ చేసే వీడియోలో.. హీరో బదులుగా అశ్విన్‌ ముఖాన్ని పెట్టింది. ఇక బస్సులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ముఖాలను పెట్టింది.

రవిచంద్రన్‌ అశ్విన్‌ పరుగెత్తుకుంటూ వచ్చి బస్సులోని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ముఖాలను చూడడం.. విరాట్ ఇచ్చే హావభావాలు హైలెట్ అయ్యాయి. ‘యాష్ అన్న ప్రపంచకప్‌ 2023 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు’ అని రాజస్థాన్ రాయల్స్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘వచ్చేశా, నేను వచ్చేశా’, ‘యాష్ అన్న ఎంట్రీ సూపర్’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యాష్ పరుగెత్తుతున్న వీడియోని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.