Jagananna Arogya Suraksha: ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని కోసం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. వచ్చే రెండు నెలల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కొనసాగనుంది.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ కింద ఇంటింటి ఆరోగ్య సర్వే, ఉచిత పరీక్షలు, మందులు, అవసరాన్ని బట్టి చికిత్స అందించనుంది ప్రభుత్వం.. ఈ క్యాంపైన్ లో ప్రజాప్రతినిధులు అందరూ కచ్చితంగా పాల్గొనాలని నేతలను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
ఇక, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ లాంఛనంగా ప్రారంభం అయ్యిందని తెలిపారు సీఎం జగన్.. కలెక్టరేట్లు, డివిజన్ కార్యాలయాలు, సచివాలయాల్లో ఇప్పటికే ఓరియంటేషన్ ఇచ్చారు.. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.. గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం లేదు.. ప్రివెంటివ్ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయంగా పేర్కొన్నారు. ధైర్యంగా, సాహసోపేతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం.. దీనికి కారణంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వానికున్న సిబ్బందే అన్నారు. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్స్‌ను తీసుకురాగలిగాం.. 542 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి.. ఉండాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచేలా రిక్రూట్ చేశాం.. ప్రివెంటివ్ కేర్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెస్ట్‌ను తీసుకుని రాగలిగాం.. ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీలు ఉంచాం.. ప్రతి పీహెచ్‌లోసీ 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు కూడా ఉండేలా చూశాం.. మొత్తంగా మండలంలో నలుగురు డాక్టర్లు కూడా మండలంలో గ్రామాలను సమానంగా పంచామని వెల్లడించారు.
జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నాం అన్నారు ఏపీ సీఎం.. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం.. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నాం.. తర్వాత వారికి తుపరి పరీక్షలు కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం.. నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ గురించి, వైయస్సార్ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం.. ఎవ్వరికీ సందేహాలు లేకుండా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తాం.. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆమేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తాం అన్నారు. వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం.. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం.. కేన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం.. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోందన్నారు.
ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం అన్నారు సీఎం జగన్.. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుంది.. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 15 నుంచిజరుగుతోంది.. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు.. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారు.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు.. ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు.. టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు.. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఎక్కడ చికిత్స అందుతుంది? ఎలా వెళ్లాలి? ఏదైనా ఇబ్బంది ఉంటే.. ఎవర్ని సంప్రదించాలి? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందిస్తారు.. ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్ చేయిస్తారు.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనత పై ప్రత్యేక దృష్టిసారిస్తారు.. గ్రామంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై వివరాలు అందిస్తారు.. అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, వారికి కళ్లజోళ్ల ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న సురక్షలో ఇస్తారు.. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నవారికి తదనంతర సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? ఈరెండు అంశాలపై కూడా సురక్షలో ప్రత్యేక దృష్టిలో పెడతారు.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయని స్పష్టం చేవారు సీఎం జగన్..
సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తారు తెలిపారు సీఎం జగన్.. సిబ్బంది ఓనర్ షిప్ తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలి.. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు, సీహెచ్‌ఓలు, ఇతర సిబ్బంది ఓనర్‌షిప్ తీసుకోవాలి.. చికిత్సలు వారికి అందడమే కాదు, ఆతర్వాతకూడా వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వీరందరిపైనా ఉంది అన్నారు. మరోవైపు.. డాక్టర్లు నిర్దేశిత నాలుగైదు గ్రామాల్లో సేవలు అందిస్తారు.. ఒక పీహెచ్‌సీలో ఒక డాక్టరు ఉంటే, రెండో డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ నిర్వహిస్తారు.. గ్రామంలో నెలకు కనీసం రెండు సర్లు వెళ్లేలా ప్రణాళిక అమలు చేస్తున్నాం.. ఒకే డాక్టర్, ఒకే గ్రామానికి నెలకు రెండు సార్లు వెళ్తున్నారు.. దీంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యంమీద ఒక అవగాహన డాక్టరుకు ఉంటుందని తెలిపారు సీఎం జగన్.. కావాల్సిన మందులు తీసుకెళ్లి.. వారికి అండగా నిలిచే అవకాశం కలుగుతుంది.. వీటన్నింటితో పాటు ఆరోగ్య శ్రీని కూడా ప్రతి పేదవాడూ వినియోగించుకునేలా తీర్చిదిద్దాం.. వైద్యం కోసం పేదవాళ్లు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం అన్నారు. 1050 నుంచి 3256 చికిత్సలను ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తున్నాం.. నెట్‌వర్క్ ఆస్పత్రులను విస్తరించామని పేర్కొన్నారు సీఎం..