Leading News Portal in Telugu

Canada: ట్రూడో ప్రభుత్వం హిందువులు-సిక్కుల మధ్య విభజన సృష్టిస్తోంది..


Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపణల్ని ‘చైల్డిష్’గా అక్కడి భారతీయ సంఘాలు కొట్టిపారేశాయి. ఈ వ్యాఖ్యలకు ఖచ్చితమైన ఆధారాలు ఉండాలన్నారు. కెనడాలో కేవలం ఒకటి రెండు శాతం మంది తీవ్రవాదులు ఉన్నారు, మిగిలిన సిక్కులు వారితో లేరని, వారికి సొంత అభిప్రాయాలు ఉన్నాయని ఇండియన్ కమ్యూనిటీ మెంబర్ అమన్ దీప్ సింగ్ చబ్బా అన్నారు.

ట్రూడో ఖచ్చితమైన ఆధారాలు అందించాలని, లేకుంటే భారత్-కెనడా సంబంధాల్లో విభజనకు దారి తీస్తుందని, ట్రూడో చర్యలు బాధపెట్టాయని అమన్ దీప్ సింగ్ అన్నారు. పెద్ద సమస్యలను కూడా దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన ఇరు దేశాలకు సూచించారు.

ట్రూడో ప్రభుత్వం కెనడాలో హిందువులు, సిక్కుల మధ్య విభజన సృష్టిస్తోందని డాక్టర్ రాజ్ జగ్‌పాల్ అన్నారు. ట్రూడో చేస్తున్నది తప్పని, వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెనడాలో హిందువులు, సిక్కుల మధ్య తేడా లేదని, సమస్యను పరిస్కరించాలని, ప్రభుత్వం ఓట్లు పొందడానికి ఈ విభజన సృష్టస్తోందని ఆరోపించారు. ఇండో కెనడియన్ మంజీర్ బిర్ మాట్లాడుతూ.. ప్రజలు సంతోషంగా ఉండేలా రెండు దేశాల మధ్య శాంతి కొనసాగించాలని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. కెనడాలో భారతీయ సమాజం ఆందోళన చెందుతోందని చెప్పారు.

జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే అతని హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. దీనికి నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఇవ్వాల్సిందిగా భారత్ కోరిందని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల తెలిపారు. అయితే కెనడా నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అన్నారు.