Leading News Portal in Telugu

Hafiz Saeed: ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కొడుకు హత్య.. సోషల్ మీడియాలో ప్రచారం..


Hafiz Saeed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ హత్యకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27న కమాలుద్దీన్ సయూద్‌ని గుర్తు తెలియని వ్యక్తుల పెషావర్ నుంచి కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అతన్ని హత్య చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అంతకుముందు హఫీస్ సయీద్ కొడుకు కిడ్నాప్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ దేశం మొత్తాన్ని జల్లెడపట్టినా అతని ఆచూకీ కనుగొనలేకపోయారని తెలుస్తోంది. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు జియావుర్ రెహ్మాన్ అనే హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతుంది.

నెటిజన్లు కొందరు కమాలుద్దీన్ హత్య చేయబడ్డాడని ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేస్తున్నారు. అతడి ఒంటిపై గాయాలున్నాయని, హింసించి చంపారని, అతని మృతదేహాన్ని ఖైబర్ ఫఖ్తంఖ్వాలోని జబ్బా వ్యాలీలో స్వాధీనం చేసుకున్నారని, ఐఎస్ఐ అతనికి అంత్యక్రియలు చేసిందని పోస్టులు పెట్టారు. ఈ ఉదంతంపై అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, ఐఎస్ఐ కానీ, ఉగ్రసంస్థలు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

హఫీస్ సయీద్ 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరేతోయిబా చీఫ్ గా ఉన్నాడు. ఇదే కాకుండా ఉగ్రవాదం కోసం జమాత్ ఉద్ దావా అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. పాక్ సైన్యం సయీద్ కు రక్షణ ఇస్తోంది. యూఎన్, భారత్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, రష్యా ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించాయి.