Leading News Portal in Telugu

బటన్ నొక్కినా సొమ్ములేవీ?.. ఏపీకి ఇక జగన్ వద్దు! | what is the need of jagan for ap| people| button| press| election| amma| vodi| vahanamitra| fee| reimbursement| kapunestam


posted on Sep 29, 2023 10:04AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన కేవలం కక్ష సాధింపులకు, బటన్ నొక్కి ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చన్న భ్రమలకే పరిమితమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. అధికారాన్ని మొత్తం విపక్షాలపై కేసులు, వేధింపులకు మాత్రమే వినియోగించిన జగన్ రెడ్డి.. ఎన్నికలు ముందుకు వచ్చే సరికి బటన్ నొక్కడానికీ, ఒక వేళ నొక్కినా ఆ మేరకు లబ్ధి దారుల ఖాతాలలో జమ కావడానికి నిధులు లేక బిత్తర చూపులు చూస్తున్నారు.

గతంలో బటన్ నొక్కిన పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా పూర్తిగా నగదు జమకాలేదు కానీ ఇప్పుడు మరో కొత్త బటన్ నొక్కేందుకు రెడీ అయిపోయారు. వాహనమిత్ర పేరులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో పది వేల రూపాయల చొప్పున జమ చేస్తామంటున్నారు. అయితే ఆయన బటనైతే నొక్కు తారు కానీ అందుకు సంబంధించి సొమ్ములు మాత్రం ఖాతాలలో పడేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. 

ఇక ఇప్పుడు తాజాగా ఆయన వాహన మిత్ర పేరుతో ఏపీలో ఆటోలు, కార్లపై  ఆధారపడే వాళ్లకు సొమ్ములు జమ చేస్తామంటున్నారు. అది కూడా రెండు లక్షల మందికి. అంటే జగన్ దృష్టిలో రాష్ట్రంలో వాహనాలు నడపడం ద్వారా జీవనోపాధి పొందేవాళ్లు రెండు లక్షల మంది మాత్రమేనా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే అదలా ఉంచితే.. వాళ్లకైనా జగన్ బటన్ నొక్కగానే సొమ్ములు వారి ఖాతాలలో జమ అవుతాయా అంటే మాత్రం ఔనన్న సమాధానం రావడం లేదు. బటన్ నొక్కుకుంటే వెళ్లడమే ముఖ్యమంత్రి పని.. అందుకు సంబంధించి సొమ్ములు జమ అవుతాయా? అయితే ఎప్పుడు అవుతాయి? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నెల కిందట జగన్ బటన్ నొక్కి పదేరం చేశానని చెప్పుకున్న  ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఆయా లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదు. కానీ పీజురీయింబర్స్ మెంట్ కోసం జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మాత్రం కొట్లలో ఖర్చయ్యింది.

పందేరం చేయని డబ్బుల కోసం సభలెందుకు అంటారా?   మరి జగన్ మాట్లాడేందుకూ, విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు వేదిక కావాలి కదా? అందుకు. బటన్ నొక్కే కార్యక్రమం కోసం మాత్రమే జగన్ రెడ్డి ప్యాలెస్ దాటి బయటకు వస్తారు.  తన ప్రభుత్వ పథకాలను చెప్పుకోవడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరు. ఎందుకంటే విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  జనాలకు సొమ్ములు పందేరం చేస్తున్నామంటే కనీసం లబ్ధిదారులైనా తన సభకు వస్తారన్న ఉద్దేశంతోనే జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు మాత్రమే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు కూడా దారికి ఇరువైపులా పరదాలు కట్టుకుని.. తాను, లేదా తన పార్టీ ఎంపిక చేసిన వారు మాత్రమే సభకు హాజరయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ వేదిక ఎక్కుతారు. ఇక అక్కడ ఆయన వాగ్ధాటిని అడ్డుకునే వారెవరూ ఉండరన్న ధైర్యంతో ప్రభుత్వ కార్యక్రమం అని కూడా గుర్తించకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తారు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించేస్తారు. తన విమర్శలను కనీసం సభకు వచ్చిన వారు వింటున్నారా? బటన్ నొక్కడం అయిపోగానే.. ప్రసంగం ప్రారంభించగానే వెనుదిరిగి వెళిపోతున్నారా అన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోరు. తన ప్రసంగం తాను కొనసాగించేసి మమ అనేస్తారు. అంతే ఆయన పబ్బం గడిచిపోతుంది. మళ్లీ మరో బటన్ నొక్కుడ కార్యక్రమంలో తప్ప ఆయన బయట కనబడరు.

 బటన్ నొక్కినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు జమ కాలేదు. అలాగే కాపు నేస్తం అంటూ బటన్ నొక్కారు. ఆ నిధుల విషయం కూడా అతీగతీ లేదు. అడుగుదామంటే బెదరింపులు.  ఇక అమ్మఒడికి ఆయన ఎప్పుడో బటన్ నొక్కేశారు. అందుకు సంబంధించిన సొమ్ముల కోసం అమ్మలు ఎదురు చూస్తూనే ఉన్నారు. విడతల వారీగా అప్పుడో కొంత మంది, ఇప్పుడో కొంత మంది అన్నట్లుగా నిధులు అక్కౌంట్లలో జమ అవుతున్నాయి.   ఇక వాహనమిత్రకు ఆయన బటన్ నొక్కి మాత్రం లబ్ధిదారులకు చేకూర్చే ప్రయోజనం ఏముంటుందని జనం అంటున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో  మహిళలకు అందాల్సిన చేయూత పథకం కోసం బటన్ నొక్కాల్సి ఉంది.  అది ఎప్పుడు అన్న విషయంలో స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీకి జగన్ ఎందుకు అంటూ కొత్త కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఔను జనం కూడా అదే అంటున్నారు. ఏపీకి జగన్ ఎందుకు? అవసరం లేదు అంటున్నారు.