Pawan Kalyan Varahi Vijaya Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు విడతలుగా వారాహి విజయయాత్రను పూర్తి చేశారు.. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో వారాహి యాత్ర నిర్వహించిన ఆయన ఇప్పుడు కృష్ణా జిల్లాలో యాత్ర నిర్వహణకు సిద్ధమయ్యాడు.. నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ కల్యాణ్ అక్టోబర్ 1వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు నాదెండ్ల మనోహర్.. అయితే.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ యాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయన్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందని వెల్లడించారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మా పొత్తులపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అటువంటి పోస్టులు, వ్యాఖ్యలపై ఎవరూ స్పందించ వద్దని సూచించారు. పొత్తులు పదవుల కోసం కాదు.. రాష్ట్రం, ప్రజల క్షేమం కోసం కలిసి పనిచేస్తున్నాం.. త్వరలోనే మన ప్రజా ప్రభుత్వం వస్తుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ధీమాను వ్యక్తం చేశారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.