Leading News Portal in Telugu

YSR Congress Party: వైసీపీకి షాక్‌.. పార్టీకి సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల రాజీనామా..


YSR Congress Party: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు రాజీనామా చేశారు.. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు.. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేసి తర్వాత వైసీపీలో చేరాం. సర్పంచుల సమస్యలపై ఎన్నోసార్లు మంత్రి, అధికారులను కలిశాను.. 15 శాతం నిధులు మాకు తెలియకుండా దారి మళ్లించారని.. నిధులు, విధులు లేవని నిజాంపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి చెప్పాం. సీఎం అపాయింట్మెంట్ కోసం ఎందరినో కలిశాం, అయినా లాభం లేకుండాపోయిందన్నారు.. సర్పంచి వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు.. ఇదేం న్యాయం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందరో సర్పంచులు ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ ఆవేదన బెలిబుచ్చారు పాపారావు.. ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థను డమ్మీగా మార్చింది.. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్రంలో ఇంకా చాలా మంది సర్పంచులు వైసీపీకు రాజీనామా చేసే అవకాశం ఉంది. త్వరలో జనసేన పార్టీలో చేరుదామని నిర్ణయించుకున్నానని ప్రకటించారు చిలకలపూడి పాపారావు.. మరోవైపు.. సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి నరేంద్రబాబు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా వలంటరీ వ్యవస్థను తేవడాన్ని కాగ్ కూడా తప్పు పట్టిందని గుర్తుచేశారు.. పంచాయతీరాజ్ వ్యవస్థ దెబ్బతింటే గ్రామాల మనుగడ దెబ్బతింటుందన్న ఆయన.. రాష్ట్రంలో 13 వేల మంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచులు తలుచుకుంటే 50 లక్షల ఓట్లు ప్రభావితమవుతాయని హెచ్చరించారు. మా సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి నరేంద్రబాబు.