రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు పదవి ఉన్నా లేకున్నా నా గుండె చప్పుడు మాత్రం.. నియోజకవర్గ ప్రజలతోనే ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. సంగీత నిలయంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావును పార్టీ కార్యకర్తలకు పరిచయం చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు.. నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సంగీత నిలయంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఆరుసార్లు మా తండ్రి రాజేశ్వరరావు గెలిచారు ఆరుసార్లు ఓడిపోయారు… అయినా నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నారు.. నేను కూడా మీతోనే ఉంటా పదవి ఉన్నా లేకున్నా అధైర్య పడకండని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు మద్దతుగా నియోజకవర్గస్థాయి ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విచ్చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఈ సమావేశానికి సీనియర్ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ అరుణా రెడ్డి హాజరుకాకపోవడ గమనార్హం.