Leading News Portal in Telugu

Narendra Modi: రేపు తెలంగాణ పర్యటనకు వస్తూనే.. ఆ పార్టీలపై ప్రధాని మోడీ విమర్శలు


ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. ‘రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను.. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని ఆయన ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశ పారంపర్య పార్టీలు’’ అంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

ఇక, మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అయితే, మరోవైపు రేపటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కోలుకోనందునే తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కూడా వాయిదాపడింది.

ప్రధాని మోడీ షెడ్యూల్ :

రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోడీ..
1.35కి ఎయిర్‌పోర్ట్ నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్‌కు పయనం.
మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకోనున్న ప్రధాని మోడీ
మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్న మోడీ
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న సమరభేరి సభలో పాల్గొననున్న ప్రధాని
అనంతరం హెలికాఫ్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం