Leading News Portal in Telugu

Bihar CM Convoy: సీఎం కాన్వాయ్ కోసం గంటసేపు ఆగిన అంబులెన్స్.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!


Ambulance stopped 1 Hour for Bihar CM Nitish Kumar’s Convoy: తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని తరలిస్తున్న అంబులెన్స్‌ను సుమారు గంట పాటు పోలీసు అధికారులు ఆపేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన పాట్నాలో శనివారం చోటుచేసుకుంది. పాట్నా సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌ కోసం అంబులెన్స్‌ను ఆపడంతో.. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నలందలో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించి సీఎం నితీష్ కుమార్ పాట్నాకు తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రయాణానికి వీలుగా పాట్నా పోలీసులు అన్ని ట్రాఫిక్‌లను నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళుతున్న ఓ అంబులెన్స్‌.. ఫాతుహా-దానియావాన్ జాతీయ రహదారిపై రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ సమీపంలో ట్రాఫిక్‌లో గంటసేపు చిక్కుకుపోయింది. చిన్నారి ఆరోగ్యం బాగాలేదని, అంబులెన్స్‌ను వెళ్లేందుకు అనుమతించాలని చంటిబిడ్డ కుటుంబీకులు భద్రతా అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది.

అంబులెన్సులో చంటిబిడ్డతో ఉన్న మహిళ ఆందోళన చెందింది. అంబులెన్స్ సుమారు గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నందున చిన్నారి ఆరోగ్యం కాస్త విషమించింది. చిన్నారి ఏడుస్తుండగా తల్లి ఊయల ఊపుతూ ఓదార్చింది. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం బిహార్‌లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అంబులెన్సును ఆపిన పోలీసును గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడైనా పోలీసులను ప్రభుత్వం హెచ్చరిస్తుందో చూడాలి.