Leading News Portal in Telugu

Nadendla Manohar: వారాహి విజయ యాత్రతో ప్రజలకు బలమైన సందేశం ఇవ్వనున్న పవన్


మరోసారి ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన జగన్ మళ్లీ వద్దే వద్దు అన్నదే మా నినాదం.. రాష్ట్ర ప్రజలను దీనిపై జనసేన పార్టీ చైతన్య పరుస్తుంది.. ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలకు పవన్ కళ్యాణ్ బలమైన సందేశం ఇవ్వనున్నారు.

“వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్” అనేది జనసేన నినాదం అని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఎందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదో కూడా ప్రజలకు వివరిస్తాం.. వారిని చైతన్య పరుస్తాం.. ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమైపోతున్నారు.. నిన్న మొన్నటి వరకు గడపగడపకు ప్రభుత్వం.. జగనన్నకు చెబుదాం… జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలం చెందిన వైసీపీ నాయకులు మరోసారి ఎన్నికల ముందు “వై ఏపీ నీడ్స్ జగన్ ” అంటూ ప్రజలకు టోపీ పెట్టడానికి వస్తున్నారు అని ఆయన విమర్శించారు.

అయితే, నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మద్దతు పలికిన టీడీపీ నేతలకు మా ధన్యవాదాలు అంటూ నాదేండ్ల మనోహర్ చెప్పారు.