Leading News Portal in Telugu

IndiGo Plane Incident: గాలిలో విమానం.. చావుబతుకుల మధ్య పసికందు.. ఏం జరిగిందంటే..


IndiGo Plane Incident: గాలిలో విమానం, తీవ్రమైన గుండె జబ్బులో బాధపడుతున్నఆరునెలల పసికందు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. చావుబతుకుల సమస్య. కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది. పసికందు ప్రయాణించే విమానంలోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారే చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందులో ఒక డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్. చిన్నారి పరిస్థితిని తెలుసుకుని అత్యవసరంగా చికిత్స అందించారు.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్న శిశువుకు రాంచీ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో తీసుకెళ్తున్నారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత ఎయిర్ సిబ్బంది చిన్నారి పరిస్థితిపై ఎమర్జెన్సీ అనౌన్స్‌మెంట్ చేశారు. అదే విమానంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మొజిమిల్ ఫెరోజ్ ఉన్నారు.

వీరిద్దరు చిన్నారికి ఫ్లైట్ లో ఉండే ఆక్సీజన్ మాస్క్ ద్వారా ఆక్సీజన్ అందించారు. ఎమర్జెన్సీ కిట్ లో ఉండే అత్యవసర మెడిసిన్స్ వాడి పసికందు పరిస్థితిని చక్కదిద్దారు. శిశువుకు పట్టుకతో వచ్చే హర్ట్ కండిషన్, పెటెంట్ డక్టస్ ఆర్టెరియోసన్(పీడీఏ) ఉందని, దాని కోసమే వారు ఢిల్లీలోని ఎయిమ్స్ కి వెళ్తున్నారని డాక్టర్ కులకర్ణి చెప్పారు. డ్రగ్ కిట్ లో ఉండే థియోఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చామని, బిడ్డ తల్లిదండ్రులు డెక్సోనా ఇంజెక్షన్ తీసుకెళ్తున్నారని, ఇది చాలా సహాయకారిగా పనిచేసిందని డాక్టర్లు చెప్పారు.

చికిత్స తర్వాత పసికందు పరిస్థితి నెమ్మనెమ్మదిగా మెరుగైందని, మొదటి 15-20 నిమిషాలు చాలా కీలకం, ఒత్తడితో కూడుకున్నవని, చివరకు పసికందు కళ్లు తెరిచి సాధారణ స్థితికి వచ్చాయని, క్యాబిన్ సిబ్బంది కూడా చాలా సాయం చేశారని డాక్టర్ కులకర్ణి తెలిపారు. ల్యాండింగ్ కాగానే వైద్య సాయం కోరామని ఆయన తెలిపారు. ఉదయం 9.25 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో శివువుకి ఆక్సిజన్ సపోర్టు అందించారని, మా ప్రయత్నాలు సఫలం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు.