Leading News Portal in Telugu

Vande Bharat Express: వందేభారత్ రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. ట్రాకుపై రాళ్లు, ఇనుపకడ్డీలు…


Vande Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా పట్టాలు తప్పించాలనే కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయ్‌పూర్-జైపూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో లోకోమోటివ్ పైలెట్లు ట్రాకుపై బండరాళ్లు, ఇనుప రాడ్లను గుర్తించారు. గమనించిన వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గంగారామ్-సోనియానా సెక్షన్ల మధ్య ట్రాకుపై ఉన్న జాగుల్ ప్లేట్లలో రాళ్లు, రాడ్లనను ఉంచినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం ఉదయం 9.55 గంటలకు జరిగింది. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్, మరో నగరం ఉదయ్‌పూర్ మధ్య మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు వందే భారత్ రైలు నడుస్తోంది.