Harpal randhawa: ఆఫ్రికా దేశం జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. అతనితో పాటు ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన రియోజిమ్ ఓనర్ హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
మసావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు జింబాబ్వే మీడియా వెల్లడించింది. రియోజిమ్ కి చెందిన సెస్నా 206 విమానం జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనులకు వెళ్తుండగా శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్ లోకి వెళ్లే ముందు విమానంలోని సింగిల్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని, గాలిలోనే పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయాని నివేదికలు పేర్కొన్నాయి.
చనిపోయిన వారిలో నలుగురు విదేశీయులు కాగా.. మిగిలిన ఇద్దరు జింబాబ్వేకు చెందిన వారని పోలీసుల నివేదికను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్య పత్రిక హెరాల్డ్ పేర్కొంది. సెప్టెంబర్ 29 ఉదయం 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో విమానం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతుల పేర్లను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. అయితే రంధావా స్నేహితుడైన జర్నలిస్టు, ఫిల్మ్ మేకర్ హోప్ వెల్ ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. జ్విషావలనేలో జరిగిన విమాన ప్రమాదంలో హర్పాల్ రంధావా చనిపోయినందుకు చాలా బాధపడ్డానని, అతని కొడుకతో సహా మరో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో రాశారు.