Leading News Portal in Telugu

ISIS: చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది టెర్రరిజం.. ఐసిస్ కుట్రలో సంచలన విషయాలు..


ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్‌ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్‌పూర్ లో షానవాజ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ హ్యండర్ల నుంచి పంపిన ఉగ్రవాద సాహిత్యం, బాంబు తయారీ వివరాలు ఇతర నేరారోపణ పత్రాలను షానవాజ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే పట్టుబడిన ఉగ్రవాది షానవాజ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షానవాజ్ అతని సన్నిహితులు ముగ్గురు కలిసి పశ్చిమ కనుమలు, కర్ణాటకలోని హుబ్బలి, ధార్వాడ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

షానవాజ్ విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివాడు. అతని భార్య బసంతి పటేల్ ని ఇస్లాం మతంలోకి మార్చాడు. ప్రస్తుతం ఆమె పేరు మరియమ్ అని ఢిల్లీ పోలీస్ అధికారి హెచ్ఎస్ ధాలివాల్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురిని కోర్టులో హజరు పరచగా..7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

గత నెలలోనే ఐసిస్ మాడ్యుల్ పై ఎన్ఐఏ షానవాజ్ తో పాటు మరో నలుగురి చిత్రాలను విడుదల చేసింది. వీరిపై రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. మహ్మద్ అర్షద్ అలీగఢ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడు, జామియా మిలియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశాడు. ఇతను మత పండితుడిగా శిక్షణ తీసుకుంటున్నాడు. నిందితులు వీవీఐపీలను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారు.