Leading News Portal in Telugu

బాబు అరెస్ట్ ఎఫెక్ట్.. జనాగ్రహం ధాటికి వైసీపీ బెంబేలు! | babu arrest effect| people| anger| shattle| ycp| protests| all


posted on Oct 2, 2023 6:31PM

ఇటు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, అటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వరస పర్యటనలు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడతల వారీ  వారాహీ యాత్రలు.. ప్రతిపక్ష నేతలు ఎక్కడ అడుగు పెట్టినా పోటెత్తుతున్న జనం.. జగన్ రెడ్డీ నాలుగేళ్ళలో చేసిందేంటో చెప్తావా అంటూ నిలదీస్తూ సవాళ్లు. నో డౌట్ ఈసారి తెలుగుదేశం విజయం పక్కా అని దాదాపుగా రాజకీయ వర్గాలు ఫిక్సయిపోయాయి. ఒకపక్కసొంత సర్వేలు సహా అన్ని సర్వేలూ వైసీపీ ఓటమి అనే చెబుతుండటంతో   వైసీపీకి దిక్కు తోచకుండా అయ్యింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే మంత్రుల నోటి నుండి మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు మీడియా ముందుకు రావడం కూడా మానేసి మొహం చాటేస్తున్న పరిస్థితి.  ఏ జిల్లాకు ఆ జిల్లా స్థాయిలో నేతలంతా పక్క చూపులు చూసే వేళ  ఏం చేయాలో అర్ధం కాని వైసీపీ చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం దూకుడుకు బ్రేక్ వేయొచ్చని భావించింది.   చంద్రబాబును అరెస్ట్ చేస్తే క్యాడర్ నిరుత్సాహపడుతుంది.. పార్టీ నేతలకు వణుకు పుడుతుంది.. ప్రజలలో చంద్రబాబును దోషిని చేసి రాష్ట్రానికి ఒకే ఒక్క  ప్రత్యామ్నాయంగా వైసీపీని చూపించాలని తాపత్రయపడ్డారు. 

కానీ  సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ ఒకటి తలిస్తే మరోకటి జరిగింది.   చంద్రబాబు తప్పు చేశారని ప్రభుత్వం ఎంత అరిచి గీపెట్టినా, సీఐడీ చీఫ్ తో అమరావతి నుంచి హస్తిన వరకూ పర్యటనలు చేయించి, మీడియా సమావేశాలు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పినా జనం నమ్మడం లేదు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సి టీవీల ముందు చంద్రబాబును దోషి అంటుంటే నమ్మడం మాట అటుంచి  అలా చెబుతున్న వారిపై   ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతున్నది. చట్టం, న్యాయం గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు అనకొండలా పేరుకుపోయి ఉన్న ఆయన అవినీతి కేసుల చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లలో రోజూ అదే పనిగా చంద్రబాబును దోషిగా చిత్రీకరిస్తూ సంబరపడుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సోషల్ మీడియాను ఉపయోగించి కోటాను కోట్ల రూపాయలను కుమ్మరించి దుష్ప్రచారం చేస్తున్నా ప్రజలు  స్వచ్ఛందంగా వాటికి కౌంటర్లు వేస్తున్నారు.

 ఇక టీడీపీ నేతల విషయానికి వస్తే పార్టీ అధినేత జైల్లో ఉన్నా నేతలలో ఎలాంటి వణుకు, బెరుకు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఏ తెలుగుదేశం నేతా తొణకడం లేదు. నాలుగేళ్ల ఈ పాలనలో భరించాల్సిన నష్టాలను, కష్టాలను ఇప్పటికే చాలా చూసాం.. చాలానే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదంటూ టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా బలమైన శక్తులు కుట్రలు చేస్తున్నాయని తెలిసినా ఎక్కడా ధైర్యం సడలిపోవడం లేదు. ప్రతి కార్యకర్త ఎదురొడ్డి నిలబడుతున్నారు. ప్రతి  నేత కూడా తగ్గేదేలే అంటూ తెగించి ముందుకు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అధినేతను అక్రమంగా అరెస్ట్ చేశారన్నది అందరికీ తెలిసిన నిజమే కనుక ఈ అరెస్టుతో పార్టీకి వచ్చిన నష్టం లేదని, పైపెచ్చు  మేలే జరుగుతుందన్న ధైర్యం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది.  తమ అధినేతను అక్రమ కేసులో గత 24 రోజులుగా  జైల్లో ఉంచారన్న బాధ ఉన్నా.. జగనే ఈ అరెస్టు ద్వారా తెలుగుదేశం  విజయానికి బాటలు వేశారన్న భావన ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది. 

తెలుగుదేశంను దెబ్బకొట్టాలని, తన ఈగోను శాటిస్ ఫై చేసుకోవాలన్న దుష్ట తలంపుతో, దురహంకారంతో  సీఎం జగన్ చంద్రబాబు అక్రమ అరెస్టుకు తెగబడినా.. అది టీడీపీకి సానుభూతిపరంగా మంచి మైలేజీ ఇచ్చిందనీ ఇదు ముందు ముందు మరింత ఎక్కువై ప్రజాగ్రహ ఉప్పెనై వైసీపీని నిలువునా ముంచేయడం ఖాయమని ఇప్పటికే విశ్లేషకులు తేల్చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉన్నా.. ఆ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపిస్తుండం విశేషం. రాయలసీమ నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే చర్చలు   పూర్తయినట్లు తెలుస్తున్నది. వైసీపీ నేతలు మరికొంత మంది కూడా చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉండగానే వీరంతా టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది. కనీసం పది మంది వైసీపీ కీలక నేతలు తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీ అయ్యారని చెబుతున్నారు.  దీంతో చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ దూకుడుకు కళ్లెం వేద్దామని జగన్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యి.. జగన్ కే రివర్స్ లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.