Leading News Portal in Telugu

Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్


Bandaru Satyanarayana: మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేయగా.. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉదయం నుంచి బండారను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. చివరకు సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు మంత్రిని దూషించిన కేసులో గుంటూరుకు తరలించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

నందమూరి, నారా కుటుంబాలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు.. రోజా.. నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చరిత్ర ఎవరికి తెలియదు.. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు అని విమర్శించారు. ఇక, మంత్రి రోజాపై చేసిన బండారు కామెంట్స్ వైరల్ గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది. వైసీపీ నేతలు కూడా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.