PM Modi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు ప్రకటించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఎన్నికల్ ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. అయితే నేరుగా ప్రతిపక్షాల పేర్లను, సర్వేరు ప్రస్తావించకుండా ప్రధాని గ్వాలియర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలు అభివృద్ధిని మరిచాయని విమర్శించారు. పేద ప్రజలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్న సమయంలో పేదల భావోద్వేగాలతో ఆడుకున్నారని, ఇప్పుడు కూడా ఇదే ఆట ఆడుతున్నారని, కులం పేరుతో దేశాన్ని విభజించి, నేడు అదే పాపం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అప్పుడు అవినీతికి పాల్పడితే, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని గ్వాలియర్ లో ప్రధాని మోడీ ప్రతిపక్షాలను విమర్శించారు. కులాల వారీగా విభజన చేసే ఏ ప్రయత్నానైనా పాపంగా ఆయన అభివర్ణించారు.
ప్రధాని నేరుగా ఏ పార్టీ పేరు తీసుకోకుండా విమర్శలు చేసినా, ఇది బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వం, సీఎం నితీష్ కుమార్ టార్గెట్ గా చేస్తున్నవే అని అంతా భావిస్తున్నారు. మరోవైపు కులగణనను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమర్థించారు. అధికారంలోకి వస్తే దేశం మొత్తం కులగణన చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల ముందు కులగణన ప్రధానాంశంగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా ఇందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.