Leading News Portal in Telugu

Pawan Kalyan: అంచలంచలుగా అధికారంలోకి రాగలం.. ఒకేసారి గెలవలేం..


Pawan Kalyan: సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్‌లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు. ఈ మధ్య వైసీపీని తిట్టడం లేదని.. ఎందుకంటే ఓడిపోతున్న వాళ్లను చూసి జాలిపడుతున్నామన్నారు. జనసేన బలం 14% – 18% ఎదిగాం అని ఎనిమిది నెలల క్రితమే చెప్పామన్నారు. అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని పవన్‌ స్పష్టం చేశారు.

డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను.. సినిమాలు సమీప భవిష్యత్‌లో ఆపేస్తానని ఆయన వెల్లడించారు. బీజేపీ క్రిస్టియన్స్ ఉండే గోవాలో ప్రభుత్వం స్థాపించిందని.. ప్రజలకు ఉపయోగపడితేనే అలయన్స్ ఉంటుంది.. ఉపయోగపడకపోతే అలయన్స్ ఉండదన్నారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా అనేది తనకు సందేహమేనన్నారు. అలయన్స్‌లో వెళితే మనకి బలమైన సీట్లు వస్తాయని.. అసెంబ్లీలో బలమైన పాదముద్ర ఉండబోతుందని పవన్‌ పార్టీ నేతలకు సూచించారు. జనసేన , టీడీపీ ఎదుగుతాయని.. ఎవరైనా వస్తే కచ్చితంగా కలుస్తామని, ఒక్క వైసీపీ తప్ప అంటూ జనసేన అధినేత స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరుని చతుర్ముఖ నగరంగా తీర్చుదిద్దుతామన్నారు. మనలో మనం‌ కొట్టుకుంటే మళ్లీ జగన్ వస్తాడు మన రక్తం తాగేస్తాడని పవన్‌ పేర్కొన్నారు. వచ్చేది అధికారంలోకి మనమే కానీ జగన్ అనే వ్యక్తిని తక్కువ అంచనా వేయద్దన్నారు.

టీడీపీ- జనసేన కలిసినా యుద్ధం గట్టిగానే ఉంటుందన్నారు. సీఎం అవుతానా లేదా అనేది మన గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందన్నారు. ప్రతికూల పరిస్దితుల్లో ఉన్నారని టీడీపీ‌ని తక్కువ అంచనా వేయకండి అని జనసేన నేతలకు పవన్‌ సూచించారు. కక్షసాధింపులు తగ్గించుకుందాం లేదంటే జగన్‌లా తయారవుతామన్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది మాట్లాడుకుందామని నేతలకు సూచనలు చేశారు.