Leading News Portal in Telugu

Crime News: దారుణం.. చిన్నారిని కిరాతకంగా రాయితో కొట్టి హతమార్చిన సవతి తల్లి


Crime News: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా రాయితో కొట్టి హతమార్చింది ఓ కసాయి సవతి తల్లి. ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయితీ సరియపల్లిలో హర్సిని అనే మూడేళ్ల చిన్నారిని వంతాల నీలమ్మ అనే సవతి తల్లి కాఫీ తోటలకు తీసుకువెళ్లి అతి కిరాతకంగా రాయితో కొట్టి హతమార్చి అనంతరం గ్రామంలోకి వచ్చి లొంగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. నిందితురాలిని వారు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సరియపల్లికి చెందిన భాస్కరరావు తన మొదటి భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు ఉండగా.. నీలమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి నుంచి మొదటి భార్య పిల్లలపై సవతి తల్లి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమెపై అనుమానం రావడంతో భాస్కరరావు ఇటీవల తన కొడుకును పక్కఊరిలో దాచి ఉంచాడు. చిన్నారి హర్శిని ఇక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో తండ్రి లేని సమయంలో మూడేళ్ల హర్శినిని కొండపై కాఫీ తోటలోకి తీసుకెళ్లి ఆ సవతి తల్లి రాయితో కొట్టి దారుణంగా హతమార్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోగా.. చిన్నారిని హత్యచేసిన ఆ సవతి తల్లిపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.